రాం ప్రసాద్‌ హత్యకు సినీ ఫక్కీలో వ్యూహ రచన

రాం ప్రసాద్‌ హత్యకు సినీ ఫక్కీలో వ్యూహ రచన

పంజాగుట్టలో హత్యకు గురైన స్టీల్ వ్యాపారి రాంప్రసాద్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. రాం ప్రసాద్‌ను హత్య చేసిన నిందితులు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సినిమాను తలపించే కట్టుకథకు వ్యూహ రచన చేశారు.

రాంప్రసాద్‌ను తానే చంపానని శ్యామ్ అనే వ్యక్తి అంగీకరించి పోలీసులకు లొంగిపోయినా.. అతడి వెనుక కోగంటి సత్యం ఉన్నాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రాంప్రసాద్‌ను చంపేందుకు ఆయన ఏకంగా ఏడు టీమ్‌లు ఏర్పాటు చేశాడని పోలీసులు గుర్తించారు. ఒక టీమ్‌ శ్యామ్, మరొక టీమ్‌ ప్రసాద్ అనే మరో అనుచరుడి ఆధ్వర్యంలో ప్లాన్ అమలు చేసేలా పక్కా పథకం రచించాడని పోలీసులు గుర్తించారు.

రాం ప్రసాద్‌ హత్యకు సినీ ఫక్కీలో వ్యూహ రచన చేశాడు కోగంటి సత్యం. రాం ప్రసాద్‌ హత్యను సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్ నుంచి ప్రత్యక్షంగా చూసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈకేసు తనపైకి రాకుండా ఉండేందుకు అదేరోజు తాను తిరుమలలో శ్రీవారి సన్నిధిలో ఉన్నట్లు వీడియోలు క్రియేట్ చేశాడు. వెంకటేశ్వరస్వామి విగ్రహం పక్కన నిలబడి ఉన్న ఈ వీడియోలో సీఎం జగన్ పరిపాలను పొగుడుతూ మాట్లాడాడు.

రాంప్రసాద్‌ను చంపేందుకు కిరాయి హంతకులకు కోటి రూపాయలు సుపారీ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందులో మొత్తం 9మంది ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు ఆరుగురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు. మిగిలిన వాళ్లు కూడా దొరికితేనే ఈ కేసుపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ హత్యకేసుకు సంబంధించి స్కెచ్ వేసినవాళ్లు, హత్యలో పాల్గొన్నవారు రెండు నెలల నుంచి హైదరాబాద్‌లో మకాం వేసి రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. కిరాయి హంతకులకు చెల్లింపులన్నీ కోగంటి సత్యం అనుచరుడు శ్యామ్ చేతుల మీదుగానే చేసినట్లు గుర్తించారు.

మొత్తానికి… రాంప్రసాద్ హత్యకేసులో కోగంటి సత్యం పాత్ర ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తున్నా బలమైన ఆధారాలు మాత్రం పోలీసులకు ఇంకా లభించలేదు. శ్యామ్ చెప్పిన వివరాల ఆధారంగా సాక్ష్యాలు సేకరిస్తున్న పోలీసులు కేసును ఛేదించడంలో సక్సెస్‌ అవుతారా? లేదా? వేచిచూడాల్సిందే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *