నెల్లూరు సిటీలో టీడీపీ వర్సెస్‌ వైసీపీ

నెల్లూరు సిటీలో టీడీపీ వర్సెస్‌ వైసీపీ

సింహపురి..ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది రాజకీయ చైతన్యం.దశాబ్దాలుగా జిల్లాను ఏలిన ఎన్నో కుటుంబాలు సింహపురిలో చక్రం తిప్పాయి.అలాంటి నెల్లూరు సిటీలో ఈసారి టీడీపీ,వైసీపీ మధ్య పోరు నువ్వానేనా అన్నట్లు సాగుతోంది.గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఘన విజయం సాధించిన అనిల్ కుమార్ యాదవ్ మరోసారి బరిలో ఉండగా..టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నారాయణ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.ఓ వైపు అధికార పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన అభివృద్ధి పనులు మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీ ఎమ్మెల్యే సొంత నిధులతో చేసిన అభివృద్ధి పనులు ప్రజల ముందున్నాయి.ఈ నేపథ్యంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారోనని నియోజకవర్గ ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

2009లో నియోజకవర్గ పునర్విభజన అనంతరం నెల్లూరు సిటీ నియోజకవర్గం ఏర్పడింది.ఈ నియోజకవర్గంలో రెడ్ల ప్రభావం ఎక్కువగా ఉంది.ఆ తరువాత స్థానంలో ఎస్సీలు బీసీలు ఉంటారు.ఈ సెగ్మెంట్‌లో 2లక్షల 38వేల 794 మంది ఓటర్లు ఉండగా..అందులో పురుషుల ఓట్లు లక్షా 16వేల 771 మంది,అలాగే మహిళా ఓటర్లు లక్షా 21వేల 944 మంది ఉన్నారు.209 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

మరో 8 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నెల్లూరు సిటీలో ఇరువురు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.సామాన్యుడికి..వందల కోట్ల అధిపతికి మధ్య జరుగుతున్న పోరాటం అన్న నినాదంతో అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రజల్లోకి వెళ్తున్నారు.అంతేకాదు..నగరంలో అభివృద్ధి జరగలేదని..అవినీతి మాత్రమే జరిగిందని వైసిపి అభ్యర్థి అనిల్ కుమార్ అంటున్నారు.

మరోవైపు నెల్లూరు సిటీలో ఓటు అడిగే హక్కు తనకు మాత్రమే ఉందని మంత్రి నారాయణ అంటున్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీకి సైతం రాని వారికి ఓటు అడిగే హక్కు లేదంటున్నారు. నెల్లూరు సిటీకి 5 వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేశామని తనను గెలిపిస్తే నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని దేశంలోనే నంబర్ 1 సెగ్మెంట్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నా…నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు టీడీపీ గెలుపొందలేదు.దీంతో గత ప్రభుత్వంలో మంత్రి పనిచేసిన నారాయణ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ఒకవేళ టీడీపీ గెలిస్తే అటు నారాయణకు ఇటు టీడీపీకి నియోజకవర్గంలో మొదటిసారి గెలిచినట్లవుతుంది.ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ఇప్పటికే తాను చేసిన అభివృద్ధి పనులతో విస్తృత ప్రచారం చేస్తున్నారు.

నెల్లూరు సిటీలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి నేతలు చేసిందేమీ లేదని స్థానికులు చెబుతున్నారు.అలాగే ఇక్కడి స్థానికులను ట్రాఫిక్‌ సమస్య పట్టి పీడిస్తోంది.రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు,అండర్ పాస్‌లు లేక నానా ఇబ్బందులుపడుతున్నారు.నగరం అభివృద్ధి చెందుతున్నప్పటికీ..మాస్టర్ ప్లాన్ లేకపోవడం..

ఇలా కుబేరుడికి,సామాన్యుడికి మధ్య జరుగుతున్న హోరాహోరీ పోరు ఆసక్తి రేపుతోంది.అంతిమంగా నెల్లూరు సిటీ ప్రజలు ఎవరికి పట్టం కడుతారనేది ఆసక్తిగా మారింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *