నెల్లూరులో వైసీపీ సీనియర్ల లీడర్ల అసంతృప్తి .?

నెల్లూరులో వైసీపీ సీనియర్ల లీడర్ల అసంతృప్తి .?

వైసీపీకి కడప తరువాత అంతటి పట్టు ఉన్న జిల్లా నెల్లూరు జిల్లా. ఈ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 10 అసెంబ్లీ స్థానాలతో పాటు, నెల్లూరు- తిరుపతి పార్లమెంట్ స్థానాల్లో జిల్లాకు చెందిన నేతలు విజయం సాధించారు. 2014లో కూడా రెండు పార్లమెంట్ స్థానాలు, 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలిచింది. ఆ మాటకొస్తే వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా ఆ పార్టీని ఇక్కడి ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం తరువాత కోవూరు, ఉదయగిరితో పాటు నెల్లూరు పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. జిల్లాలో జగన్ మీద వున్న ఆదరణతో పాటు…. ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా ఎవరికి తగ్గట్టు వారు ప్రజల్లో వుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. పార్టీ కోసం అందరం కష్టపడి జగన్ ను సీఎం చేసుకున్నాం. కానీ, మంత్రి పదవుల ఎంపిక లో మాత్రం తమకు ప్రాధాన్యత కల్పించలేదని కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారట. తమ సీనియారిటీని పక్కన పెట్టారనీ తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారట.

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార యాదవ్ రెండో సారి ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి అయ్యారు. 39 ఏళ్ల వయసులోనే మంత్రి పదవిని చేపట్టారు. పైగా అత్యంత కీలక మైన నీటి పారుదల శాఖను దక్కించుకున్నారు. జిల్లా చరిత్రలోనే తొలి సారిగా బీసీ వర్గాలకు చెందిన మంత్రిగా కూడా గుర్తింపు సాధించారు. అనిల్ టీడీపీలో అంగ అర్ధ బలం ఉన్న మంత్రి నారాయణను ఢీకొట్టి నిలబడ్డారు. నారాయణ పై చెమటోడ్చి గెలుపొంది అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రియ శిష్యుడుగా చెప్పుకునే అనిల్ విధేయతకు జగన్ ప్రాధాన్యత నిచ్చి మంత్రని చేశారు.

ఒకప్పుడు జిల్లా కాంగ్రెస్ లో ఆనం, నేదురుమల్లి తరువాత మేకపాటి కుటుంబం కీలకంగా ఉన్నారు. అయితే జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు రాగానే మేకపాటి కుటుంబం జగన్ ఫ్యామిలీకి అండగా నిలిచారు. దీంతో, ఆ కుటుంబానికి చెందిన మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతం రెడ్డికి జగన్ కేబినెట్‌లో చోటు కల్పించారు. గౌతంరెడ్డి ఆత్మకూరు నుంచి రెండో సారి మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయాల్లోకి రాక మునుపు నుంచి గౌతమ్ కి జగన్ తో మంచి సన్నిహిత సంబంధాలు వున్నాయి. అందుకే మేకపాటి కుటుంబం జగన్ కి తొలి నుంచి మద్దతుగా నిలుస్తూ వస్తోంది. ఈనేపథ్యంలో జగన్ గౌతమ్‌కు పరిశ్రమలు, ఐటీ శాఖను కేటాయించారు. అలా జిల్లాలో రెడ్డి, బీసీ సామాజిక వర్గాలకు మంత్రి పదవి ఇచ్చి జగన్ సమతూకం పాటించారు.

ఐతే, ఈ ఎంపిక పై కొందరు ఎమ్మెల్యేలు లోలోన రగిలిపోతున్నారట. ముఖ్యంగా ఎన్టీఆర్, వైఎస్ ప్రభుత్వాల్లో కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆనం రామనారాయణ రెడ్డిది. పార్టీలోనే కాదు జిల్లాలో వున్న సీనియర్ నేతల్లో ఆనం మొదటి వ్యక్తి. పైగా దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను శాసించిన కుటుంబం. అలాంటి ఆనం ప్రస్తుతం పార్టీకి జూనియర్ అయిపోయారు. రామనారాయణ రెడ్డి గత ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి వెంకటగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ, జగన్ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆనంను పక్కనబెట్టేశారు. తాము రాజకీయాల్లోకి తీసుకువచ్చిన జూనియర్ నేత అనిల్ కి మంత్రి పదవి ఇవ్వడం.. అనుభవం లేని వారిని మంత్రులు చేయడాన్ని ఆనం శిబిరం జీర్ణింటుకోలేకపోతుందట.

వీరే కాదు రెండో సారి ఎమ్మెల్యే లుగా గెలిచిన కావలి ఎమ్మెల్యే , నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిలు కూడా తమకు ఛాన్స్ దొరుకుతుందని ఆశపడ్డారు. ఎస్సీ కోటాలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య , గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా క్యాబినెట్ లో చోటు కోసం ఎదురు చూశారు. కానీ వీరికి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం మంత్రులుగా ఎంపిక అయిన మేకపాటి, అనిల్ యాదవ్ ల కంటే తామేం తక్కువని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా వాపోతున్నారట. రెండున్నరేళ్ల తరువాత ఛాన్స్ వుంటుందిలే అన్న మరో ఆశతో సర్ధుకుపోతున్నారట.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *