కమల్ వ్యాఖ్యలతో కలకలం

కమల్ వ్యాఖ్యలతో కలకలం

తమిళనాట ఆయన విశ్వరూపం చూపిస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో, తరతూ విమర్శలు కొని తెచ్చుకుంటున్నారు. నాథూరామ్‌ గాడ్సేపై కమల్ మాటలను ఏవిధంగా అర్థం చేసుకోవాలి? ఓట్ల కోసం చేసిన జిమ్మిక్కులా? లేక కమలాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలా? అసలు కమల్‌ స్ట్రాటజీ ఏంటి?

మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. స్వతంత్ర భారతదేశంలో తొలి హిందూ ఉగ్రవాది నాథూరాం గాడ్సే అన్న కమల్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. తమిళనాడులోని అరవకురుచ్చి అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు జరుగుతున్నాయి. కమల్ హాసన్ తన పార్టీ అభ్యర్థి తరుఫున ప్రచారం చేస్తూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కమల్ కామెంట్స్‌ను తప్పుబడుతూ కొందరు తీవ్రస్థాయిలో మండిపడుతుండగా, మరికొందరు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు పలు రాజకీయ పార్టీలు, మైనార్టీ సంఘాల నుంచి విశేషమైన మద్దతు లభించింది. ఇక, బీజేపీ మాత్రం కమల్‌హాసన్‌పై అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. కమల్ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత అశ్వీని ఉపాధ్యాయ కోర్టును ఆశ్రయించాడు. కమల్ ప్రచారం చేయకుండా నిషేధం విధించాలని బీజేపీ నేతలు ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉంటే, కమల్ హాసన్‌కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మద్దతు తెలిపారు. మహాత్మాగాంధీని చంపిన గాడ్సేను హంతకుడిగా అభివర్ణించక గొప్పవాడిగా ఎలా చిత్రీకరిస్తారని అసద్ ప్రశ్నించారు. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ అయితే గాడ్సేను తీవ్రవాది అంటే ఫర్వాలేదని.. హిందువుగా అభివర్ణించడం తప్పు అని మండిపడ్డారు. 2017లో కూడా హిందూ తీవ్రవాదంపై కమల్ హాసన్ ఇలాంటి కామెంట్సే చేశారు. అప్పుడు ఆయన సినిమాను హిందూత్వవాదులు అడ్డుకున్నారు కూడా.

తమిళనాట మే 19న నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలు జరగనున్నాయి. అందులో అరవకురుచ్చి ఒకటి. కమల్ హాసన్ పార్టీ ‘మక్కళ్ నీది మయ్యమ్’ నుంచి మోహన్‌రాజ్ అభ్యర్థిగా నిలిచారు. ఉప ఎన్నికల్లో ఓట్లు రాబట్టడానికి కమల్ విద్వేషపూరిత వాతావరణం కల్పిస్తున్నారంటూ ప్రత్యర్థులు విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. కమల్ మాత్రం గాంధీ విగ్రహం చూసే తాను అలా అన్నానని, ముస్లిం ఓట్లను చూసి కాదని చెప్పుకొచ్చారు. కమల్‌హాసన్‌పై తమిళనాడు, ఢిల్లీ సహా వివిధ ప్రాంతాల్లో పలు కేసులు నమోదయ్యాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *