నా సమయం, శరీరం దేశం కోసమే: మోదీ

నా సమయం, శరీరం దేశం కోసమే: మోదీ

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి జెట్‌స్పీడుతో దూసుకెళ్లింది. 300పై చిలుకు స్థానాల్లో స్పష్టమైన లక్ష్యంతో విజయదుందిభి మోగించింది. అంతేకాదు.. బీజేపీ అగ్రనేతల మెజార్టీ కూడా గతంలో కన్నా బాగా పెరిగిపోయింది. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి కూడా బీజేపీనే విజయం సాధించగా.. ఇక కమనాథులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

మోదీ హవాతో బీజేపీ రికార్డు స్థాయిలో గెలుపు దిశగా దూసుకుపోయింది. ప్రభుత్వం ఏర్పాటుకు మేజిక్‌ ఫిగర్‌ 272 స్థానాలు అవసరం కాగా.. బీజేపీ సొంతంగానే మేజిక్‌ మార్క్‌ను దాటింది. 2014లో ఆపార్టీ సాధించిన స్థానాలను మించి అత్యధిక స్థానాలు కమలం ఖాతాలో పడటం ఖాయమైంది. ఇక ఎన్డీయే కూటమి 349 స్థానాల్లో విజయ దుందిభి మోగించగా.. విపక్ష కాంగ్రెస్ కేవలం 85 స్థానాలకే పరిమితమయ్యింది. ఇక ఇతరులు 108 స్థానాల్లో గెలుపొందారు.

ఇక ప్రధాని మోదీ వారణాసిలో మూడు లక్షల అరవై వేలకు పైగా మెజారిటీతో అఖండ విజయం సాధించారు. అదే విధంగా స్పష్టమైన మెజారిటీతో బీజేపీ గెలుపు దిశగా దూసుకువెళ్లిన నేపథ్యంలో ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు నిజం చేస్తూ ఎన్నికల తుది ఫలితాలు వెలువడిన తరుణంలో.. ఎన్డీయే విజయాన్ని భారత్‌ విజయంగా మోదీ అభివర్ణించారు.

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులు విజయం సాధించలేదని.. దేశ ప్రజలే ఈ ఎన్నికల్లో విజేతలన్నారు ప్రధాని మోదీ. ఈ విజయం ప్రజాస్వామ్య విజయమని, దీన్ని సగౌరవంగా ప్రజలకు అంకితం ఇస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలుపొందిన విజేతలందరికీ పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో 130 కోట్ల మంది ప్రజలు దేశం కోసం నిలబడ్డారని మోదీ కితాబిచ్చారు.

ఇక బీజేపీ చీఫ్ అమిత్ షా .. తమ కంచుకోట గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి 5 లక్షల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. చెప్పాలంటే బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అద్వాణి కంటే 35 వేల ఓట్లతో విజయం సాధించారు. అయితే.. నామినేషన్ వేసే సమయంలోనే మంది మార్బలంతో ర్యాలీ తీసిన షా… తర్వాత కూడా జోరుగా ప్రచారం చేశారు. దీంతో ఆయన 5 లక్షల 81 వేల 831 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు.

ఇదిలా ఉంటే.. మోదీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా. ఇది మోదీ ప్రభుత్వ విధానాలకు దక్కిన విజయమని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ బలీయ శక్తిగా అవతరిస్తుందని చెప్పారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పెద్ద ఎత్తున హింస, రిగ్గింగ్‌కు పాల్పడినా పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ 18 స్ధానాలు గెలుపొందిందన్నారు.

మొత్తానికి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలే నిజమయ్యాయి. దీంతో బీజేపీయే విజయం సాధించగా.. కాంగ్రెస్ హస్తవ్యస్తం అయ్యింది. మరోసారి కాషాయం రెపరెపలాడటంతో కమలనాథులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *