బాద్‌'షా'- మోదీ

బాద్‌'షా'- మోదీ

స్వతంత్ర భారతంలో 17వ లోక్‌సభ ఎన్నికల క్రతువు ముగిసింది. ఈ ఎన్నికల సమరం ఓ రాజకీయ మహాసంగ్రామాన్ని తలపించింది. అంచనాలకు అందకుండా… అనూహ్య పొత్తులు.. అంతుచిక్కని ఎత్తు గడలు. నాటకీయ మలుపులు… వాడి-వేడి విమర్శలతో ఆద్యంతం ఆసక్తిరేపిన ఎన్నికల సమరంలో మరోసారి ఎన్డీయే కూటమి విజయదుందుభి మోగించింది.

మోదీ ఛరిష్మాకు… అమిత్‌షా వ్యూహ చతురతకు సవాలుగా నిలిచిన 2019 ఎన్నికల పోరులో మరోసారి ఈ ఇద్దరు నేతలు తమ సత్తా చాటుకున్నారు. బీజేపీ శ్రేణుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ… వరసగా రెండోసారి తిరుగులేని మెజార్టీతో జయభేరి మోగించారు. మోదీ వర్సెస్ విపక్షాలుగా సాగిన ఎన్నికల సంగ్రామంలో బీజేపీ ఏకపక్ష విజయం రాజకీయ విశ్లేషకులకు సైతం అందని ద్రాక్ష పండులా మిగిలిపోయింది.

సిద్ధాంతాలు వేరు… దారులు వేరు. ఒక్కొక్కరి ప్రయోనాలు వేరు… ఒక్కొక్కరి వ్యూహాలు వేరు. కానీ మోదీని ఓడించాలన్న లక్ష్యంతో విపక్షాలు జట్టుకట్టాయి. సుదీర్ఘ కాలం కత్తులు దూసుకున్న రాజకీయ శత్రువులు సైతం ఎన్నికల ముందు దోస్తీ కట్టాయి. కలయో నిజయో… వైష్ణవ మాయో అన్న చందంగా… సిద్ధాంత వైరుధ్యాలను పక్కనపెట్టి ఒకే ఒరలో ఇమిడిపోయేందుకు ప్రయత్నించాయి. మహాఘట్‌ బంధన్ పేరుతో సమరశంఖం పూరించాయి. కానీ రాజకీయ రణక్షేత్రంలో విపక్షాల ఐక్యత కుప్పకూలింది.

ఎన్నికలకు ఏడాదిన్నరకు ముందు రాహుల్‌ గాంధీ రాఫెల్‌ ఒప్పందంతో బీజేపీపై విరుచుకుపడ్డారు. చౌకీ దార్ ఛోర్‌ హై… స్లోగన్‌తో మోడీ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నించారు. అనారోగ్యంతో బాధపడుతున్న మనోహర్ పారిక్కన్‌ను పరామర్శించి రాజకీయంగా లబ్ధి పొందేందుకు యత్నించారు. భారత సైన్యం శక్తియుక్తులను ప్రశ్నిస్తూ… మొత్తంగా మోదీపై ముప్పేట విమర్శల దాడి చేశారు. ఇదే సందర్భంలో మోదీ-షా మాత్రం ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు.

ఇక బీజేపీ సాధించిన విజయానికి మోదీ ఛరిష్మాతో పాటు… అమిత్‌ షా రాజకీయతంత్రం ఎంతో కీలకంగా నిలిచింది. ఇక చెప్పాలంటే బీజేపీకి మోదీ ఓ అద్భుతమైన అస్త్రం. ఆ అస్త్రాన్ని ఎలా ప్రయోగించాలన్న నేర్పరితనం అమిత్ షా సొంతం. అందుకే వరుసగా రెండోసారి పార్లమెంటు ఎన్నికల్లో ఇద్దరు నేతలు కమలదళానికి విజయసారథులుగా అవతరించారు. మొత్తంగా భారత రాజకీయ చరిత్రలో బీజేపీకి వరుసగా రెండోసారి అఖండ విజయాన్ని కట్టబెట్టారు మోదీ అండ్ అమిత్‌షా. రాజకీయ రణరంగంలో అద్భుత వ్యూహంతో సరికొత్త చరిత్ర సృష్టించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *