ట్విటర్‌కే పరిమితమయిన చినబాబు

ట్విటర్‌కే పరిమితమయిన చినబాబు

పార్టీ ఓటమి, నేతల జంపింగ్స్‌కు తోడు కార్యకర్తలపై దాడులతో తమ్ముళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సమయంలో కేడర్‌కు చేరువై భరోసానివ్వాల్సిన ఆ నాయకుడు, పిట్టగూటికే పరిమితమయ్యారు. చినబాబు తీరును తీవ్రంగా తప్పుబడుతున్న నేతలు.. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీని బలోపేతం చేయాలని వేడుకుంటున్నారు. పార్టీ కష్ట కాలంలో ఉన్న సమయంలో కూడా బయటకు రాకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ట్వీటర్‌ను వదిలేసి జనంలోకి రావాలని కోరుతున్నారు.

ఘోర ఓటమి నుంచి తెలుగు తమ్ముళ్లు బయట పడక ముందే.. ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు వారిని మరింత ఆవేదన కు గురి చేస్తున్నాయట. ముఖ్యంగా పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న మాజీ మంత్రి లోకేష్ వ్యవహార శైలిపై తమ్ముళ్లు మండిపడుతున్నారట. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో చంద్రబాబు సహా పార్టీ నేతలంతా వైసీపీ తీరును విమర్శిస్తున్నారు. కానీ, లోకేశ్ మాత్రం ఏ ఘటన జరిగినా ట్విటర్‌లోనే స్పందిస్తున్నారు.

పార్టీ ముఖ్యనేతలు బీజేపీ, వైసీపీతో టచ్ లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరిచాల్సిన లోకేష్, రోజుకు రెండు మూడు ట్వీట్లు చేసుకుంటూ కాలం గడుపుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముగిసిన తర్వాత ఒకటి రెండు సార్లు మినహా.. ఇప్పటివరకు మీడియా ముందు కానీ, బహిరంగ వేదికలపై కానీ లోకేశ్ గట్టిగా స్పందించిన దాఖలాలు లేవు. అధికార వైసీపీ నేతలు, మంత్రులు చంద్రబాబు-లోకేష్ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. ఐతే, దీనిపై కూడా లోకేశ్ ట్విటర్‌లో కౌంటర్ ఇస్తున్నారు.

చంద్రబాబు స్వయంగా గుంటూరు పార్టీ కార్యాలయంకు వెళ్లి నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. దాడులకు గురి అయిన కార్యకర్తల కుటుంబాల్ని జిల్లాలకు వెళ్లి పరామర్శిస్తున్నారు. ఆ వయసులోనూ అధినేత అంతలా కష్టపడుతుంటే, లోకేష్ మాత్రం బయటకు రాకపోవడం పార్టీ నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోందట. పార్టీ వ్యవహారాలపై కానీ, ప్రభుత్వం విషయంలో గానీ…లోకేష్ ట్విట్టర్ నుంచి బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం లేదు. ఈ పరిణామాలపై తెలుగుదేశం వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

ట్విటర్ లో సానుభూతి ప్రకటించి..ట్విటర్ లోనే ధైర్యంగా ఉండండి అని కార్యకర్తలకు చెబుతున్నారు లోకేశ్. ఈ తీరుతో పార్టీ నేతలు పరేషాన్ అవుతున్నారు. ట్విట్టర్ లో ట్వీట్ చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయా? పార్టీ బలోపేతం అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ భారమంతా చంద్రబాబు ఒక్కరే తన భుజస్కందాలపై మోస్తున్నారని తమ్ముళ్లు అంటున్నారు. ఇప్పటికే లోకేష్‌ను ట్విటర్ బాబు అంటూ అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈనేపథ్యంలో ఇకనైనా ట్విటర్ వదిలి క్షేత్ర స్థాయిలోకి వెళ్లాలని, పార్టీ పటిష్టతకు కృషి చేయాలని తమ్ముళ్లు కోరుతున్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *