ప్రేమ పేరుతో యువత పెడదారి!

ప్రేమ పేరుతో యువత పెడదారి!

యువత ప్రేమ పేరుతో పెడదోవపడుతున్నారు. కలిసి చదువకున్న వారినో… కొత్తగా పరిచయమైన వారినో… ప్రేమిస్తున్నానని వెంటపడటం.. కాదంటే ఉన్మాదిలా మారటం.. తరువాత కోరుకునే వారిపై దాడి చేయటం ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇలాంటి ఘటన హైదరాబాద్‌లోని దిల్ సుఖ్ నగర్‌లో జరిగింది.

ఒక వైపు ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుంటే.. మరోవైపు యువత చిన్న చిన్న విషయాలకు ఉన్మాదుల్లా మారుతున్నారు. ప్రేమ వ్యవహారంలో విచక్షణను కోల్పోయి… వారి జీవితాలతో పాటు … వారు కోరుకునే వారి జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. హైదారాబాద్ దిల్ సుఖ్‌ నగర్‌లో తన ప్రేమను తిరస్కరించిందని వెంకటేష్ అనే యువకుడు.. మనస్విని అనే అమ్మాయిని కిరాతకంగా గొంతుకోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్‌, బడంగ్‌పేటకు చెందిన మనస్విని ఇద్దరూ.. హైదరాబాద్‌లో ఓ ఇన్‌స్టిట్యూట్‌లో బ్యాంక్‌ కోచింగ్‌ తీసుకుంటున్నారు. అక్కడ ఏర్పడిన పరిచయం బలపడి స్నేహంగా మారింది. అయితే.. గత కొంత కాలంగా వెంకటేశ్‌ ప్రవర్తన నచ్చని మనస్విని అతడిని దూరంగా ఉంచింది. మనస్తాపానికి గురైన వెంకటేష్ ఆమెపై కసి పెంచుకున్నాడు. దీంతో దిల్‌సుఖ్‌నగర్‌లోని బృందావన్‌ లాడ్జిలో 501 నంబర్‌ గదిని అద్దెకు తీసుకున్నాడు. అనంతరం మనస్వినికి ఫోన్‌ చేసి ఇక్కడకు రావాలని పిలిచాడు. స్నేహితుడే కదా అనుకోని వెంకటేష్‌తో కలిసి ఆమె కూడా లాడ్జికి వెళ్లింది. అయితే.. లాడ్జిలో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారంలో మాటా మాటా పెరిగి ఈ దారుణానికి దారి తీసినట్టు తెలుస్తోంది.

పథకం ప్రకారం వెంకటేశ్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి.. అనంతరం తన చేయిని కూడా గాయపరుచుకున్నాడు. ఆమె గదిలో కేకలు పెట్టడంతో లాడ్జి సిబ్బంది రూమ్ తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో మనస్విని పడి ఉంది. వెంటనే పోలీసులుకు సమాచారం అందించి యువతిని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు వెంకటేశ్‌ కూడా పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా బృందావన్‌ లాడ్జిలో రికార్డుల్ని స్వాధీనం చేసుకొని.. వీరిద్దరూ ఏ సమయంలో లాడ్జిలోకి వచ్చారు? ఏ పేరుపై వీరిద్దరి ప్రవేశానికి అనుమతించారు? అనే అంశాలను ఆరా తీస్తున్నారు. హోటల్‌లోని సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *