ఎం.ఎస్.కే ప్రసాద్ రాజీనామా తప్పదా...!?

ఎం.ఎస్.కే ప్రసాద్ రాజీనామా తప్పదా...!?

ప్రపంచ కప్‌లో భారత్ భంగపడింది. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఆటల్లో ఓటమి సహజమే అయినా ఓడిన పద్దతిని మాత్రం భారత క్రీడాభిమానులు జీర్ణించుకులేకపోతున్నారు. ఈ ఓటమి వెనుక భారత బ్యాట్స్‌మెన్ వైఫల్యం ఎంత ఉందో… జట్టును ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీదీ అంతే ఉందంటున్నారు.

కులరాజకీయాలు…

భారత క్రికెట్ అభిమానుల చూపు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వైపు మళ్లింది. దీనికి సెలక్షన్ కమిటీ చైర్మన్, మాజీ క్రికెటర్ ఎం.ఎస్.కే. ప్రసాద్ ఒక కారణమైతే, తెలుగు ఆటగాడు, బ్యాట్స్ మెన్ అంబటి తిరుపతి రాయుడు మరో కారణం. ఎం.ఎస్.కే ప్రసాద్ ఒంటెత్తు పోకడల కారణంగానే రాయుడిని ఎంపిక చేయలేదనే వాదనలు వినిపిస్తున్పాయి. నాలుగో స్ధానంలో బ్యాంటింగుకు ఎవరు సరిపోతారని దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న సమయంలో సీనియర్ క్రికెటర్లతో సహా భారత క్రికెట్ అభిమానులంతా రాయుడి వైపే మొగ్గు చూపారు. అతని ఎంపిక లాంఛనమే అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా విజయ్ శంకర్‌ని ఎంపిక చేశారు. ఈ నిర్ణయంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అయ్యింది. పైగా ఫామ్‌లో లేని దినేష్ కార్తీక్‌ను ఎంపిక చేయడమూ వివాదాస్పదమైంది. ఎం.ఎస్.కే ప్రసాద్ చేసిన ఈ ఎంపికల వెనుక కుల రాజకీయాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తనను ఎంపిక చేయకపోవడంతో అలిగిన అంబటి రాయుడు ప్రపంచ కప్ మ్యాచ్‌లను చూసేందుకు త్రీడీ కళ్లజోడు సిద్ధం చేసుకుంటున్నానని కూడా ప్రకటించాడు.

ఆ ప్రభావం ప్రసాద్‌పై ?

కారణాలు ఏమైనా ప్రపంచ కప్‌కు ఎంపిక చేసిన జట్టుసెమీఫైనల్లో ఓటమి చెందడంతో ఆ ప్రభావం సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎం.ఎస్.కే ప్రసాద్‌పై పడుతోంది. పైగా అంతకు ముందు జరిగిన మ్యాచ్‌ల్లో ఆడని దినేష్ కార్తీక్‌ను సెమీఫైనల్లో ఆడించారు. కచ్చితంగా రాణించి జట్టును ఆదుకోవాల్సిన సమయంలో దినేష్ కార్తీక్ అవుట్ కావడంతో క్రీడాభిమానులంతా సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎం.ఎస్.కే ప్రసాద్‌ను బాధ్యుడిగా చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది వైరల్‌గా మారుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో జట్టు వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి ఎం.ఎస్.కే ప్రసాద్ రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎం.ఎస్.కే ప్రసాద్ జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీతో చర్చించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆ తర్వాత సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి ఎం.ఎస్.కే ప్రసాద్ రాజీనామా చేసే అవకాశాలున్నాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *