వావ్...ధోనీ ది సూపర్...!

వావ్...ధోనీ ది సూపర్...!

మహేంద్రసింగ్ ధోనీ…ఆధునిక క్రికెట్‌లో ఒక సంచలనం… టీ‌‌-‌20లకు దాదాపు రారాజుగా వెలుగొందుతున్నాడనడంలో సందేహం లేదు.

అతడు ఏ జట్టులో ఉన్నా… ఆ జట్టుకు ఇంధనం లాంటివాడు. ఎప్పటిలానే ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ సీజన్‌లో చైన్నై సూపర్ కింగ్స్ జట్టకు నేతృత్వం వహిస్తున్నాడు. సీఎస్‌కే ఈ సీజన్ లో దుమ్ము రేపుతోంది. సీనియర్ ఆటగాళ్లు… వయసు మీరిన ఆటగాళ్లు ’డాడీస్ టీమ్‘ అనే వ్యాఖ్యానాలు వినిపించినా, తమ ఆటతీరుతో ఈ జట్టు తిరుగులేని విజయాలు సాధిస్తోంది. అందుకు ధోనీయే కారణమని వేరే చెప్పాలా? అందుకు ఇంకేవైనా నిదర్శనాలు కావాలా? వెన్నునొప్పి కారణంగా ధోనీ రెండు మ్యాచ్‌లలో ఆడలేకపోతే, సీఎస్‌కే ఆ రెండింటిలోనూ ఓడిపోయింది. ఇక మంగళవారం రాత్రి ఢిల్లీతో జరిగిన మ్యాచ్ ధోనీ నాయకత్వ ప్రతిభను మరోసారి క్రీడాలోకానికి చాటి చెప్పింది.

మెరుపులు మెరిపించాడు…

రన్ రేట్ అంతగా లేని దశలో ఎవరూ ఊహించని విధంగా మూడో స్థానంలో బరిలోకి దిగిన ధోనీ తన బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు. అటు వికెట్ కీపర్ గానూ రెండు కళ్లు చెదిరే స్టంపింగ్ లు చేశాడు. ఢిల్లీని ఏ దశలోనూ కోలుకోని విధంగా దెబ్బ తీశాడు. ఇది చాలదా? ధోనీ గొప్పదనం గురించి చెప్పుకోవడానికి. అందుకే ధోనీకి ప్రేక్షకుల ఆదరణ విపరీతంగా ఉంటుంది. చెపాక్ స్టేడియంలో ధోనీ బ్యాట్ చేత పట్టుకుని బ్యాటింగ్ కోసం మైదానంలోకి వస్తుంటే స్టేడియమంతా హోరెత్తిపోయింది. అతడు ఫోర్లు, సిక్సులు కొడుతుంటే ఉర్రూతలూగిపోయింది. మెరుపు వేగంతో స్టంపింగులు చేస్తుంటే మైమరచిపోయింది. ఒక ఆటగాడి గొప్పదనం గురించి చెప్పుకోవడానికి ఇంతకన్నా ఏం కావాలి! అందుకే ఏ దేశ క్రీడాకారులు అయినా ధోనీ నాయకత్వంలో ఆడడానికి అమితంగా ఇష్ట పడతారు. తాహిర్, హర్భజన్ సింగ్ లాంటి వెటరన్ బౌలర్లు యువబౌలర్లతో పోటీ పడుతూ.. ఒక్కోసారి వారి కంటే మిన్నగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నారంటే, పరుగులను నియంత్రిస్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారంటే అందుకు స్ఫూర్తి ధోనీయే. ఏ ఆటగాడిని ఎలా వాడుకోవాలో ధోనీకి తెలిసినంతగా ఇతర ఏ కెప్టెన్ కూ తెలియదంటే అతిశయోక్తి కాదు. “అది 120 బంతుల మ్యాచ్ అయినా, 300 బంతుల మ్యాచ్ అయినా ధోనీ మైదానంలో ఉన్నాడంటే ఆట మొత్తం అతడి ఆధీనంలో ఉంటుంది” అని సాక్షాత్తూ భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడంటే ధోనీ విశిష్టత ఏమిటో అర్థం కావడం లేదూ..!!!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *