కేరళ నుంచి ముందుకు కదలని రుతుపవనాలు!

కేరళ నుంచి ముందుకు కదలని రుతుపవనాలు!

నైరుతి రుతుపవనాల కదలికలకు ఈ ఏడాది అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘వాయు’ తుపాను రుతుపవనాలు ముందుకు కదలకుండా అడ్డుకుంటోంది. కేరళలో ఉన్న రుతుపవనాలు అక్కడి నుంచి ముందుకు కదలలేదు. ఇప్పటివరకూ కేరళ ఉత్తరభాగానికి కూడా విస్తరించలేదు. వాయు తుపాను తీవ్రగాలులు రుతుపవనాల్లోని తేమను లాగేస్తున్నాయి. దీనివల్ల రుతుపవనాల ముందుకు విస్తరించి వర్షాలు పడటం తాత్కాలికంగా ఆగిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 15 కల్లా తెలంగాణకు రుతుపవనాలు వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడించింది.

సాధారణ పరిస్థితులుంటే జూన్‌ 15 నాటికి ఇవి తెలంగాణ, మహారాష్ట్రలను దాటి గుజరాత్‌ వరకూ విస్తరించాలి. ఈసారి ఆ పరిస్థితులు లేవు. ఐదేళ్ల క్రితం అంటే 2014లో జూన్‌ 19న తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. ఆ ఏడాది కేరళకు జూన్‌ 6న రాగా 13 రోజుల తరవాత తెలంగాణకు చేరాయి. ఈ ఏడాది కేరళ నుంచి తెలంగాణకు రావడానికి వారం వరకూ పట్టే అవకాశాలున్నాయి.

మరోవైపు తెలంగాణలో ఇవాళ, రేపు ఎండలు ఎక్కువగా ఉంటాయని, ఉత్తర తెలంగాణలో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అధిక ఎండలున్న ప్రాంతంలో ప్రజలు బయట తిరగరాదని హెచ్చరించింది. రామగుండంలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాలిలో తేమ కూడా సాధారణంకన్నా 11 శాతం తగ్గి 60కి చేరడంతో ఉక్కపోతలతో ప్రజలు అల్లాడుతున్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *