కాలుష్య కోరల్లో విశాఖ నగరం

కాలుష్య కోరల్లో విశాఖ నగరం

విశాఖ అనగానే సుందర సముద్ర తీరం, నిరంతరంగా వస్తూ వెళ్తూ ఉండే పెద్ద పెద్ద ఓడలు, భారత తీరాన్ని పరిరక్షించే యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఇలా ఒకటేమిటి, ఎన్నో ఎన్నెన్నో అందాలు గుర్తుకు వస్తాయి. కానీ విశాఖ నగరం ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో ప్రజలు సతమతం అవుతున్నారు. కాలుష్యం నియంత్రణపై నేతలు హామీలు ఇచ్చినా గెలిచాక వాటి ఊసే ఎత్తడం లేదు.

అందమైన పకృతి పరిసరాలలో నెలకొన్న విశాఖ నగరం అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నమహా నగరం. వేగంగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతున్నది. ప్రస్తుత అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందిన మహానగరం ఇదొక్కటే. కానీ విశాఖ నగరం ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. పోర్ట్, హెచ్పిసీఎల్, కొరమండల్ వంటి పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పలు గ్రామాల ప్రజలు విలవిలాడుతున్నారు. కాలుష్య నియంత్రణకు చర్యలు చేపడుతున్నామాని అధికారులు చెబుతున్నా.. అవన్నీ మాటలకే పరిమితమైయ్యాయి. ఎన్నికల సమయంలో కాలుష్య నియంత్రణకు ఆయా పరిశ్రమల యాజమన్యాలపై ఒత్తడి తెస్తామని హామీలు ఇచ్చినా.. ఎన్నికల తర్వాత వాటిని గాలికి వదిలేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఉదయం నిద్ర లేవగానే అందరూ స్వచ్ఛమైన గాలిని పీలిస్తే విశాఖ వాసులు మాత్రం విషపు గాలిని పీలుస్తూ దినచర్య ప్రారంభిస్తారు. దేశంలో అత్యధికంగా కాలుష్యం విడుదల చేస్తున్న 24 కీలక ప్రాంతాల్లో ఒకటిగా, ఆంధ్రప్రదేశ్‌లో మొదటి స్థానంలో విశాఖ నగరం ఉంది. రికార్డు స్థాయిలో జరుగుతున్న ఇనుప ఖనిజం ఎగుమతి, బొగ్గు దిగుమతులతో విడుదలవుతున్న కాలుష్యానికి కొలమానం లేదు. ఇక పోర్టులకు రోజూ వచ్చే వాణిజ్య నౌకలు, కోట్లాది రూపాయల ఆదాయంతో పాటు జనానికి హాని కలిగించే బంకర్‌ ప్యూయెల్‌ను మోసుకొస్తున్నాయి. చాలా పరిశ్రమల్లోని వ్యర్థాలను శుద్ధి చేయకుండానే అక్కడికి చేరువలో ఉన్న నదుల్లోకి, వాగుల్లోకి నేరుగా సముద్రంలోకి వదులుతున్నారు.

కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్‌, చర్మ సంబంధమైన వ్యాధులు, కిడ్నీలు చెడిపోవడం, నరాలకు సంబంధించిన వ్యాధులు రావడం పిల్లల పెరుగుదల నిలిచిపోవడం, గర్భస్రావాలు, రక్తం పునరుత్పత్తి కాకపోవడం.. వంటివి సంభవిస్తున్నాయి.

మొత్తానికి కాలుష్య కోరల్లో చిక్కుకున్న నగరానికి కాలుష్యం నుంచి విముక్తి కలిగించాలని విశాఖ వాసులు కోరుతున్నారు. ఇప్పుడు నేతలు ఎన్నికల్లో గెలవడానికి హామీలు ఇచ్చి మార్చిపోవద్దని సూచిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *