భారీ ఖర్చు... అభ్యర్థులను ముంచు....!?

భారీ ఖర్చు... అభ్యర్థులను ముంచు....!?

“గెలవాలి. శాసనసభ్యుడిగా అసెంబ్లీలో కూర్చోవాలి. పేరు చివర ఎమ్మెల్యే అనే బోర్డు ఉండాలి. ఇందుకోసం ఎంతైనా ఖర్చు పెట్టాలి” ఇదీ ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికలలో వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల మనోగతం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ఈసారి నువ్వా నేనా అన్నట్టుగా జరిగాయి. అటు అధికార తెలుగుదేశం పార్టీతో పాటు ఇటు ప్రతిపక్ష వైసీపీ, కొత్తగా రాజకీయ క్షేత్రంలో అడుగుపెట్టిన జనసేన తమ అభ్యర్థులను గెలుపే ధ్యేయంగా బరిలోకి దింపాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోటీ రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనీ, తిరిగి అధికారంలోకి రావాలనీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఆశిస్తే…ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని వైసీపీ అభ్యర్థులు పోటీ పడ్డారు. జనసేనా తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ దశలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ఖర్చుకు వెనకాడలేదు అంటున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక్కో అభ్యర్థీ కనీసం 25 కోట్ల రూపాయలు ఖర్చు చేసారని సమాచారం. ఇక సగం నియోజకవర్గాల్లో అయితే అభ్యర్థుల ఖర్చు 100 కోట్ల రూపాయలు అయ్యిందని చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రతి అభ్యర్థీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో మద్యం ఏరులై పారింది. సంచుల కొద్దీ డబ్బు చేతులు మారినట్టూ చెబుతున్నారు.

mptc zptc elections in telangana

గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ఆస్తులను కుదవ పెట్టి మరీ ఖర్చు చేసినట్లుగా సమాచారం. మరికొందరైతే హైదరాబాద్‌తో సహా ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ ఆస్తులను విక్రయించి ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు సమాచారం. కొన్నిచోట్ల అభ్యర్థులు రోజువారీ వడ్డీకి డబ్బులు తీసుకుని ఎన్నికలలో ఖర్చు చేసినట్లు చెప్తున్నారు. పోలింగ్ ముగిసి ఫలితాలు వెలువడడానికి ఎక్కువ సమయం ఉండడంతో రోజువారీ వడ్డీకి డబ్బులు తెచ్చుకున్న అభ్యర్థులు వడ్డీ కట్టలేక సతమతమవుతున్నారని చెబుతున్నారు. కొందరు అభ్యర్థులు రోజుకు 2 నుంచి 4 లక్షల రూపాయల వరకు వడ్డీ రూపంలో చెల్లిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలు అభ్యర్థులను ఆర్థికంగా ముంచడం ఖాయం అని అంటున్నారు. ఫలితాలు వెలువడి తాము విజయం సాధిస్తే… తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ కష్టాలు తప్పుతాయనీ, ఒకవేళ ఓటమి చవిచూడాల్సి వస్తే మాత్రం ఆర్థికంగా కుదేలవడం ఖాయమనీ అన్ని పార్టీలకూ చెందిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *