బెంగాల్‌ బెబ్బులి..దీదీ రాజకీయ జీవితంపై ప్రత్యేక కథనం..

బెంగాల్‌ బెబ్బులి..దీదీ రాజకీయ జీవితంపై ప్రత్యేక కథనం..

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆవిడది చెరగని ముద్ర. కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుగొట్టిన ఫైర్‌ బ్రాండ్‌. ప్రత్యర్థులపై తూటాల్లాంటి మాటలు విసరడంతో ఆమె స్టైలే వేరు. 33 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనకు తెరదించిన ధీర వనిత దీదీపై స్పెషల్ స్టోరి.

గుండె నిబ్బరానికి మారు పేరు మమతా బెనర్జీ. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రిగా, పశ్చిమ బెంగాల్‌ సీఎంగా మమతా బెనర్జీకి రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. మమత 1955 సంవత్సరంలో దుర్గాష్టమి రోజున జన్మించారు. తండ్రి.. ప్రమీలేశ్వర్‌ బెనర్జీ.. బెంగాల్‌ ప్రజలకు చిరపరిచితుడైన స్వాతంత్య్ర సమరయోధుడు. పదిహేనేళ్ల వయసప్పుడు మమత తండ్రిని కోల్పోయారు. దీంతో.. కాలేజీకి వెళ్తూనే ఇంటిని పోషించడం కోసం ఓ స్కూల్లో టీచర్‌గా చేరారు. ఆ తర్వాత విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలంగా పాల్గొన్నారు. పోరాటాల్లో అరెస్టయితే.. జైలుకు పాఠ్యపుస్తకాలు తీసుకెళ్లి చదివి పాసయ్యారామె.

మమత 1970వ దశకంలో రాజకీయ జీవితం ప్రారంభించారు. శరవేగంగా అడుగులు వేస్తూ తనదైన వ్యక్తిత్వంతో దూసుకుపోతున్నారు. యువజన కాంగ్రెస్‌ కార్యకర్తగా మొదలైన మమత పొలిటికల్‌ కెరీర్‌ తర్వాతి దశలో పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరింది. 1984లో జాదవ్‌పూర్‌ లోక్‌సభ స్థానానికి ఆమె పోటీ చేశారు. అప్పుడు ఆమె ప్రత్యర్థి.. సీపీఎం దిగ్గజ నేత సోమ్‌నాథ్‌ చటర్జీ. ఆయనపై దాదాపు 48 వేల ఓట్ల తేడాతో గెలవడంతో ఆమె పేరు జాతీయస్థాయిలో మార్మోగింది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. బెంగాల్లో సీపీఎం ప్రభుత్వానికి డూప్‌గా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ తీరుతో విసిగిపోయి పార్టీ నుంచి బయటికొచ్చి ‘తృణమూల్‌ కాంగ్రెస్‌’ను స్థాపించారు. 1998 డిసెంబరు 11న లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ దరోగా ప్రసాద్‌ సరోజ్‌ స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లే యత్నం చేశారు. ఎంపీ దరోగా ప్రసాద్‌ సరోజ్‌ను గల్లా పట్టి బయటికి ఈడ్చారు మమతా బెనర్జీ. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ఒక్క సీటే వచ్చింది. కానీ.. ఆమె మాత్రం అధైర్యపడకుండా పార్టీని బలోపేతం చేశారు. 2007లో సింగూర్‌, నందిగ్రామ్‌లలో భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమాలను తనకు అనుకూలంగా మలుచుకున్నారు. 2011ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టి పశ్చిమ బెంగాల్‌లో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పెళ్లి చేసుకోకుండా ప్రజలకే జీవితం అంకితం చేసిన మమతాబెనర్జీని అభిమానులు దీదీ అంటూ ఆప్యాయంగా పిలుస్తారు.

2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ గాలి వీచినా.. బెంగాల్‌లో మాత్రం దీదీ హవా కొనసాగింది. 42 లోక్‌సభ సీట్లలో 34 స్థానంలో టీఎంసీ గెలుచుకుంది. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ 211 సీట్లతో బెంగాల్‌ అధికార పీఠాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు కూడా.. అదే ధీమాతో ఆమె మోదీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. రాష్ట్రంలోని 42 సీట్లలో 30 తమవేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వ్యూహత్మకంగా 34 మంది సిటింగ్‌ ఎంపీల్లో 10 మందికి చెక్‌ పెట్టారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే చిరకాల స్వప్నం సాకారం దిశగా అడుగులేస్తున్నారు.

మమత సర్కారుపై శారదా స్కాం, నారద స్టింగ్, రోజ్‌వ్యాలీ ఆర్థిక కుంభకోణంలో మనీ లాండరింగ్‌ ఆరోపణలు వెల్లువెత్తాయి. మంత్రుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించారన్న ఆరోపణలకు, ఇటీవల సీబీఐ అధికారుల అరెస్టు వ్యవహారం ఈ వివాదాలకు మరింత ఆజ్యం పోసింది. అలాగే పార్క్‌ స్ట్రీట్‌ సామూహిక​ అత్యాచార బాధితురాలు సుజెట్టే జోర్డాన్‌పై సీఎం హోదాలో ‘అదంతా ఓ కట్టుకథ’ అంటూ మమత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రాజేశాయి. కాంగ్రెస్‌ నేతగా మమతా బెనర్జీపై ఉన్నప్పుడు… 1990 ఆగస్టు 16న, ఒక ర్యాలీలో సీపీఎం కార్యకర‍్త లాలూ అలాం ఆమెపై హత్యాయత్నం చేశాడు. దాదాపు నెల రోజులపాటు ఆమె ఆసుపత్రిలోనే ఉన్నారు. సీపీఎం ప్రోద్బలంతోనే తానీ దురాగతానికి పాల్పడ్డాననీ, క్షమించాలని కోరినా అతణ్ని దీదీ పెద్దగా పట్టించుకోలేదు. పెయింటింగ్స్‌ వేయడం, కవితలు రాయడం దీదీకి చాలా ఇష్టం. ఆమె గీసిన చిత్రాలను విక్రయించగా వచ్చిన సొమ్మును పార్టీకి ఇస్తారు. అలాగే, ఆమె ఇప్పటికి 12 దాకా పుస్తకాలు కూడా రాశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *