ఖమ్మంలో అంతు చిక్కని ఓటరు నాడి

ఖమ్మంలో అంతు చిక్కని ఓటరు నాడి

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటరు నాడి అంతు చిక్కడం లేదు. గత ఎన్నికల కంటే ఈ సారి ఓటింగ్ శాతం తగ్గింది. అధికార టీఆర్ఎస్‍, కాంగ్రెస్‍ పార్టీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. టీఆర్‌ఎస్‌ నుంచి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ నుంచి రేణుకా చౌదరి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థి వాసుదేవరావు, సీపీఐ బలపరిచిన సీపీఎం అభ్యర్థి బరిలో ఉన్నా ఓట్లు చీల్చేందుకు తప్ప విజయం సాధించే అవకాశం లేదు. ఆయా పార్టీల నేతలు కూడా పోలింగ్ జరిగిన తీరును సమీక్షించుకుంటున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల నేతలు ఫలితాలు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. అనుకూల అంశాలు, ప్రతి కూల అంశాలను బేరీజు వేసుకొని మెజారిటీ ఎంతొస్తుందనే అంచనాలు వేసుకుంటున్నారు.

కాంగ్రెస్‍, టీఆర్‍ఎస్‍ అభ్యర్థులకు ఓవైపు గెలుపు ధీమా కనిపిస్తున్నా మరోవైపు క్రాస్‍ ఓటింగ్ భయం వెంటాడుతోంది. నియోజకవర్గంలో ఒక పార్టీ అభ్యర్థి మాత్రమే ఓటర్లకు డబ్బులు పంచారని సమాచారం. అయితే ఖమ్మం నగరంలో కొన్ని డివిజన్ల ఓటర్లకు డబ్బులు చేరగా, మరికొన్ని డివిజన్లలో ఇవ్వకపోవడంతో పలు చోట్ల స్థానికులు ఆందోళనకు దిగారు. కొందరు నాయకులు తమకు డబ్బు పంచకుండా మింగేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ అనుకున్న వారు కూడా డబ్బు అందకపోవడంతో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి వైపు ఓట్లు క్రాస్ చేసినట్టు తెలుస్తోంది. మరికొందరు ఓటర్లు డబ్బులు ఇచ్చారన్న సానుభూతితో ప్రత్యర్థి అయినా వారికే ఓటు వేశారు. ఇలా రెండు పార్టీల అభ్యర్థుల మధ్య క్రాస్ ఓటింగ్ జరగడం ఎవరికి అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయో అంచనా వేయలేకపోతున్నారు.

ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‍ నాలుగు, టీడీపీ రెండు, టీఆర్ఎస్‍ ఒక స్థానంలో విజయం సాధించాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి మరో సీటులో గెలుపొందారు. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారతామని ప్రకటించినా పెద్దగా వారి వెంట ఉన్న కేడర్‍ మారకపోవడంతో ఓటింగ్ తమకు అనుకూలంగా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. ఫిరాయింపుల కారణంగా… ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతతో తమ పార్టీకి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని హస్తం నేతలు అంటున్నారు. ఓటర్లకు రూపాయి కూడా పంచకపోయినా ఫలితం తమకే సానుకూలంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే – టీఆర్ఎస్‍ అంచనాలు మరోరకంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన పరిణామాలు టీఆర్ఎస్‍ కే కలిసొస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతల చేరికలతో తమ బలం మరింత పెరిగిందంటున్నారు. కాంగ్రెస్‍ నుంచి టీఆర్ఎస్‌లోకి వలసలు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. సర్పంచ్‍ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్‍ బలం నిరూపితమైందని అంటున్నారు. అన్ని వర్గాల నేతలు పార్టీ కోసం పనిచేశారని.. అందుకే ఫలితాలపై తాము ధీమాగా ఉన్నామని గులాబీ నేతలు చెబుతున్నారు.

ఇక బీజేపీ, సీపీఎం అభ్యర్థులు ప్రధాన పోటీలో ఉన్నా ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత తొలిసారి కమ్యూనిస్టు పార్టీలు సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేశాయి. ఖమ్మంలో సీపీఎం అభ్యర్థిగా బోడ వెంకట్ బరిలో నిలిచారు. రెండు పార్టీలకు చెందిన కేడర్‍ దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నా ఓటింగ్ ఎంత వరకు ఆ పార్టీలకు అనుకూలమో తెలియడం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్ గా బరిలోకి దిగిన సీపీఎంకి ఏడు అసెంబ్లీ స్థానాల్లో కలిపి దాదాపు 56 వేల ఓట్లు పోలయ్యాయి. ఈసారి సీపీఐ కూడా కలిసి రావడంతో డిపాజిట్ దక్కించుకుంటామన్న ధీమాతో కామ్రేడ్లు ఉన్నారు. అయితే కాంగ్రెస్‍, టీఆర్ఎస్‍ అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతతో తమకు ఓటింగ్ పెరుగుతుందంటున్నారు.

మరోవైపు – బీజేపీ అభ్యర్థి కూడా డిపాజిట్ దక్కించుకుంటామన్న ధీమాతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 10 వేల లోపు ఓట్లు మాత్రమే పోలైనా ఈసారి పార్లమెంట్‌ ఎన్నికలు కావడంతో మోదీ హవా తమకు కలిసి వస్తుందని కమలం నేతలు ఆశపడుతున్నారు. కనీసం లక్ష ఓట్లు క్రాస్‍ చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలో జరిగిన పోలింగ్ అంతా ఒక వైపైతే ఖమ్మం రూటు సపరేటు. ఎవరి లెక్కల్లో వాళ్లున్నా ఓటర్ల తీర్పు ఎలా ఉందో మే 23న తేలనుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *