గరం గరం..తెలంగాణ రాజకీయం..

గరం గరం..తెలంగాణ రాజకీయం..

తెలంగాణలో రాజకీయం హాట్ హాట్ గా ఉంది. అధికార పార్టీతో పాటు మూడు ప్రధాన రాజకీయ పక్షాలు బలం పెంచుకోవడానికి వేగంగా అడుగులు వేస్తున్నాయి. ప్రత్యర్థులను అందనంత దూరంలో ఉంచాలని టీఆర్ఎస్ భావిస్తుంటే, అధికార పార్టీని ఎలాగైనా దెబ్బకొట్టాలని కాంగ్రెస్ చూస్తోంది. ఈ పార్టీల మధ్య జగడంతో వీలైనంత లబ్ధి పొందాలని బీజేపీ వ్యూహా రచన చేస్తోంది. పనిలో పనిగా టీ టీడీపీలో ఉన్న కీలక నాయకులను తమ పార్టీలోకి ఆకర్షించేందుకు యత్నాలు చేస్తోంది. టీఆర్ఎస్ లోకి వెళ్లలేక, టీ టీడీపీలో ఉండలేక సతమతమవుతున్న నాయకులు కమలం వైపు ఆశగానే చూస్తున్నారు. దీనిని సొమ్ము చేసుకోవాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

ఎవరి ఎత్తుగడలు వారివి!

కేంద్రంలో హోం శాఖ సహాయ మంత్రి పదవి పొందిన జి. కిషన్ రెడ్డి సైతం ఈ విషయంలో ఉత్సాహంగా ఉన్నారని అంటున్నారు. రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు చూస్తున్న మురళీధర్ రావు, రాంమాధవ్ కూడా పార్టీ బలోపేతానికి పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. మరో వైపు కాంగ్రెస్ కూడా చురుకుగానే వ్యవహరిస్తోంది. సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసిన అంశంపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. అదే సమయంలో ప్రజా క్షేత్రంలో గులాబీ పార్టీని ఎండగట్టాలని భావిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారంటూ ఆమరణ దీక్షకు దిగిన భట్టి విక్రమార్కకు పోలీసులు సోమవారం సాయంత్రం చెక్ పెట్టారు. దీక్షను భగ్నం చేసి భట్టిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన దీక్షను విరమించారు. పార్టీ అధినేత రాహుల్ గాంధీ సూచనల మేరకే ఆయన దీక్ష విరమించారని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.

క్షేత్రస్థాయిలో పట్టుకోసం…

మరోవైపు టీఆర్ఎస్ కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తో్ంది. పరిషత్ ఎన్నికలు అందించిన విజయాల స్ఫూర్తితో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా ముందుకు కదులుతోంది. ఈ బాధ్యతను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పార్టీ ఎమ్మెల్యేలకు అప్పగించారని సమాచారం. 2024 నాటికి పోలింగ్ కేంద్రాల వారీగా పటిష్టమైన ఓటు బ్యాంకును కలిగి ఉండేలా కార్యక్రమాలు రూపొందించాలని సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారని చెబుతున్నారు. వారికి అండగా ఉండేలా త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో సీనియర్లకు పెద్దపీట వేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *