చింతకింది మల్లేశం..ఓ సామాన్యుడి అసామాన్య గాథ!

చింతకింది మల్లేశం..ఓ సామాన్యుడి అసామాన్య గాథ!

చింతకింది మల్లేశం.. ఈ పేరు తెలియని నేతకార్మికుడుండడు. తన తల్లి బాధను దూరం చేయడానికి లక్ష్మీ ఆసు యంత్రం తయారుచేసి ఎందరో చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆవిష్కర్త అతడు. అమ్మకోసం పడ్డ తపన ఇప్పుడు చేనేత కార్మికుల కన్నీళ్లను తుడుస్తున్నది. తల్లి భుజం కోసం పడిన శ్రమ అందరి జీవితాలను భుజాన వేసుకునేలా చేసింది. ఇప్పటిదాకా 800లకు పైగా ఆసు యంత్రాలను తయారుచేసిన మల్లేశం పేరు.. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది. ఆయన ఆవిష్కరణకుగాను కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్నాడు. అలాంటి మల్లేశంకు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన జీవితకథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కుతున్నది.

యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలోని శారాజీపేటకు చెందిన నేతకారుడు చింతకింది మల్లేశం. నిరుపేద చేనేత కుటుంబం అతనిది. ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ చదువు 6వ తరగతిలోనే ఆపేసాడు. తర్వాత ప్రైవేటుగా 10వ తరగతి కూడా పూర్తి చేశాడు. అమ్మచీరలు నేస్తుంది. ఆమె రోజంతా ఆసు పోస్తేగానీ ఒక చీర తయారు కాదు. పిన్నుల చుట్టూ 9 వేల సార్లు దారాన్ని తిప్పుతుంది. అంటే దాదాపు 12-13 కిలోమీటర్ల దూరమంత పొడవు. అలా రోజుకి 18 వేలసార్లు కండెల చుట్టూ తిప్పాలి. అలా చేస్తేగానీ రెండు చీరలు తయారుకావు. మెడ లాగేస్తుంది. వేళ్లు పీక్కుపోతాయి. భుజం పట్టేస్తుంది. కంటిచూపు దెబ్బతింటుంది. తల్లి పడుతున్న బాధ మల్లేశాన్ని కదిలించింది. అమ్మ కన్నీళ్లు తుడువడానికి ఏదో ఒకటి చేయాలని మనసులో బలంగా నాటుకుంది మల్లేషంకు.

ఏదో ఒక్కటి సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్ వచ్చాడు మల్లేశం. అక్కడే ఒక పార్ట్‌టైం జాబ్ చూసుకున్నాడు. ఉద్యోగం చేస్తూనే తన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. రోజుకి కొంత చొప్పున అలా ఏడేండ్లు కష్టపడి, యంత్రానికి ఒక రూపం తీసుకొచ్చాడు. ఆ ఆవిష్కరణ పేరే లక్ష్మీ ఆసుయంత్రం. అమ్మ పేరుమీదనే 2000లో లక్ష్మీ ఆసు యంత్రం కనిపెట్టాడు. 2011లో ఈ యంత్రానికి పేటెంట్ హక్కులు వచ్చాయి.

ఈ యంత్రంతో సమయం తక్కువ పడుతుంది ఉత్పత్తి ఎక్కవగా వస్తుంది. రెండు తక్కువ కెపాసిటీ గల మోటార్లు, ఉడ్ ఫ్రేమ్ మాత్రమే ఉండడం ఈ యంత్రం ప్రత్యేకత. దీనిపై పనిచేస్తే శారీరకంగా ఎలాంటి శ్రమ, ఒత్తిడీ ఉండదు. దీంతో ఇంటిపని వంటపని చూసుకుంటూనే, వీలైనన్ని చీరలకు ఆసుపోయవచ్చు. టైం చాలా ఆదా అవుతుంది. ప్రొడక్షనూ పెరుగుతుంది. రోజులో రెండు చీరలు నేసేవాళ్లు ఈ యంత్రం ద్వారా 6-7 నేస్తారు. మామూలు ఆసు యంత్రం ద్వారా ఒక చీర నేయడానికి 5-6 గంటల సమయం పడుతుంది. కానీ ఈ మెషీన్ ద్వారా అయితే గంటన్నరలో అయిపోతుంది.

ఆసియాలోనే ఈ యంత్రం బెస్ట్. 2011లో ఆసు యంత్రానికి సాఫ్ట్‌వేర్ జత చేస్తామని అమెరికా ముందుకు వచ్చింది. ఆసు యంత్రం ఆసియాలో ది బెస్ట్ అని అమెరికాకు చెందిన పాట్ లాబ్స్ ప్రశంసించింది.2010 సంవత్సరం చివరలో ఫోర్బ్స్ జాబితాలో మల్లేశం పేరు చోటు చేసుకుంది. 2011లో ఉత్తమ గ్రామీణ ఆవిష్కర్తగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాడు. అలాగే నూతన ఆవిష్కరణలకు గాను ప్రధాని మోదీ చేతుల మీదుగా అమెజాన్ అవార్డు కూడా స్వీకరించాడు.

ఇదిలా ఉండగా తెరపైకి చింతకింది మల్లేశం చిత్రం రానుంది. బయోపిక్‌ల యుగం నడుస్తున్న ప్రస్తుత సమయంలో సామాన్యుడైన మల్లేశం జీవితం కూడా బయోపిక్‌గా తెరమీదకు రానుంది. దాదాపు యాభై శాతం చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రానికి మల్లేశం టైటిల్ ఖరారు చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *