యూపీలో కమలానికి గడ్డుకాలం

యూపీలో కమలానికి గడ్డుకాలం

దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్‌ కీలకం. అక్కడ సత్తా చాటితే ఢిల్లీ పీఠం అందుకోవడం లాంఛనమే. రెండోదశ పోలింగ్ జరిగిన ఎనిమిది లోక్‌సభ స్థానాలు బీజేపీకి అత్యంత కీలకమా? యూపీలో బీజేపీ ఏం సవాళ్లను ఎదుర్కొంటుంది? ప్రజలను ఆకట్టుకోవడానికి బీజేపీ ఏ వ్యూహాలు అమలు చేయనుంది?

భారత రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. 20 కోట్ల పైచిలుకు జనాభా. పద్నాలుగు కోట్లు దాటిన ఓటర్లు ఉన్న రాష్ట్రం. అంతేకాకుండా 80 లోక్‌సభ స్థానాలు కూడా ఉన్నాయి. యూపీలో ఈ సారి ఎలాగైనా ఎక్కువ లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ యత్నిస్తోంది. 2014 నాటి లోక్‌సభ, 2017 నాటి అసెంబ్లీ ఫలితాల్ని పునరావృతం చేసేలా ఫలితాలు ఉండాలని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. క్రితంసారి అప్నాదళ్‌తో కలిసి 73 సీట్లు కైవసం చేసుకొన్న కమలం పార్టీ ఈసారి 74 స్థానాలకు పైగా సాధించాలన్న లక్ష్యంతో పావులు కదుపుతోంది. అయితే అందుకు బీజేపీ ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

గత లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభంజనం ప్రాంతీయ శక్తుల్ని అక్షరాలా కకావికలం చేసింది. 2004, 2009 నాటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం పది స్థానాలతో సరిపుచ్చుకుంది. 2014లో 42.3 శాతం ఓట్లతో 71 సీట్లు సాధించింది. సమాజ్‌వాది పార్టీ ఐదు స్థానాల్లో గెలుపొందగా మాయావతి పార్టీకి ఒక్క సీటూ దక్కలేదు. ఇక రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 312 సీట్లను గెలుచుకోగలిగింది. ఎస్పీ బీఎస్పీలు వరసగా 47, 19 స్థానాలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. దెబ్బమీద దెబ్బతో సమాజ్‌వాది, బహుజన్‌ సమాజ్‌ పార్టీలు దిమ్మెరపోయాయి.

2014తో పోలిస్తే విపక్షాల ఉమ్మడి కూటమి నుంచి బీజేపీ ఈసారి యూపీలో అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కొంటున్నది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో విపక్షాలు విడివిడిగా పోటీ చేశాయి. యూపీలో కీలకంగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ విడివిడిగా పోటీ చేసి తుడిచిపెట్టుకుపోయాయి. కానీ ఈ సారి ఎస్పీ, బీఎస్పీలతోపాటు ఆర్‌ఎల్డీ కలిసి మహాఘట్‌బంధన్ ఏర్పాటు చేశాయి. కూటమిలో భాగస్వామి కాకున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభావం కొన్ని సీట్లలోనే ఉంటుంది. బలహీనంగా ఉన్న మిగతా పార్టీలన్నీ బీజేపీకి అవకాశం ఇవ్వరాదని భావిస్తున్నాయి. ఈ పరిణామం బీజేపీకి మింగుడు పడటం లేదు.

కేంద్రంలోనూ, యూపీలోనూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఈ సారి గెలవడం కత్తిమీద సామే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనలో ప్రత్యేకించి చెరుకు రైతుల బకాయిలు, బులంద్‌షహర్‌లో సీనియర్ పోలీసు అధికారి హత్య వంటి అంశాలు స్థానికుల్లో రగులుతున్నాయి. దీంతో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను ఆకట్టుకోవాలని అధికార బీజేపీ వ్యూహాలు అమలు చేస్తున్నది.

ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీని రంగంలోకి దించారు. ప్రియాంక రోడ్ షోలకు, సభలకు పెద్దయెత్తున జనం తరలి వస్తున్నప్పటికీ అవి ఓట్ల రూపంలో ఎంతవరకు మారుతుందన్నది ప్రశార్థకం. 2014లో గెలుపొందిన బీజేపీ ఎంపీల్లో చాలా మంది కొత్త ముఖాలే. కానీ ఈ దఫా పలు సీట్లలో సిట్టింగ్ ఎంపీలు ప్రజా వ్యతిరేకతను, పార్టీ కార్యకర్తల అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో 22 శాతం మంది దళితులున్నారు. ఓబీసీలు 45 శాతం, ముస్లిం మైనారిటీలు 19 శాతం ఉన్నారు. దళితులు, మైనారిటీలే గెలుపు ఓటములను నిర్ణయిస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *