గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి పేరుచెప్పి మహిళల అక్రమరవాణా

గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి పేరుచెప్పి మహిళల అక్రమరవాణా

అసలే కరువు… ఆపై పేదరికం.. అనంతపురం జిల్లా మహిళల జీవితాలు దుర్భరమైపోతున్నాయి. కుటుంబం కోసం బతుకుల్నిపణంగా పెట్టేలా చేస్తున్నాయి. ఉపాధి పేరుతో ఏజెంట్ల గాలానికి చిక్కి వేలాది మంది మహిళలు విలవిలలాడిపోతున్నారు. ఊరు కాని ఊరు, దేశం కాని దేశం వెళ్లి నరక కూపంలో కూరుకుపోతున్నారు. తిరిగి వచ్చే మార్గం లేక, దారి తెలియక అక్కడే తనువు చాలిస్తున్నారు.

వరుస కరువులు అనంతపురం జిల్లాను కుదేలు చేస్తున్నాయి. కుటుంబాలకు కుటుంబాలు వలసవెళ్లేలా చేస్తున్నాయి. కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు వేలాది మంది పొట్ట చేతపట్టుకొని వెళ్తున్న దృశ్యాలు ఇక్కడ నిత్యకృత్యమయ్యాయి. అయితే ఏం పని చేసినా, ఎంత కష్టపడినా.. వారి బతకులు ఏమాత్రం మారడం లేదు. ఇదే అదనుగా ఏజెంట్ల పేరుతో జిల్లాలో మాయగాళ్లు ప్రత్యక్షమవుతున్నారు. పేదరికంతో ఇబ్బందులు పడుతున్న వారికి ఉపాధి ఆశ చూపుతున్నారు. గల్ఫ్‌ దేశాల్లో మంచి పని చూపిస్తామని నమ్మబలికి నట్టేటా ముంచుతున్నారు. అక్కడికెళ్లాక లైంగిక అవసరాలు తీర్చే అంగడి సరుకుల్లా మార్చేచి సొమ్ము చేసుకుంటున్నారు.

అనంత జిల్లాలోని కదరి ప్రాంతంలో మహిళల అక్రమ తరలింపు యధేచ్చగా కొనసాగుతోంది. గతంలోఉపాధి పేరుతో ఈ ప్రాంతం నుంచి మహిళలను రెడ్‌లైట్‌ ఏరియాలకు తరలించేవారు. మాయగాళ్లు ఇప్పుడు రూటు మార్చారు. నేరుగా గల్ఫ్‌ దేశాలకు మహిళలను అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఏటా వేల సంఖ్యలో మహిళలను తరలిస్తూ ప్రమాదకరమైన దందా నడిపిస్తున్నారు.

కదిరి నియోజకవర్గంలోనే మహిళలను తరలించే 26 మంది బ్రోకర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అక్రమ తరలింపుపై పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో కొందరు బ్రోకర్లను అరెస్ట్‌ చేశారు. కానీ ఆ తర్వాత షరామాములైపోయింది. ఇప్పటికి కదిరిలో చిత్తూరు, రాయచోటి, కడప బ్రోకర్లు ఇక్కడ ఇష్టారాజ్యంగా తిరుగుతుంటారు. అయినా వారిపై చర్యలేం తీసుకోవడం లేదు పోలీసులు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *