ఉద్యమ ఖిల్లాలో ఎగిరే జెండా ఏది?

ఉద్యమ ఖిల్లాలో ఎగిరే జెండా ఏది?

కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ఎవరు గెలుస్తారనే అంశం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. కరీంనగర్ లోక్ సభ సెగ్మెంట్‌లో ఈ సారి త్రిముఖ పోటీ జరిగింది. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్‌ ఎంపీ వినోద్ కుమార్ పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బరిలో నిలిచారు. బీజేపీ పక్షాన రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ పోటీ చేశారు. ముగ్గురు సీనియర్ నేతలు కావడంతో ఈ స్థానంలో పోటీ రసవత్తరంగా సాగింది. ఎన్నికల ప్రచార సమయం నుంచి పోలింగ్ వరకు ప్రతి దశ రసకందాయంగా మారింది. అయితే, మరికొద్ది రోజుల్లో ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. కరీంనగర్ ఎంపీ స్థానంలో జెండా ఎగరేసేదెవరన్నది ఉత్కంఠ రేపుతోంది.

కరీంనగర్ ఎంపీగా ఉన్న వినోద్‌కుమార్…ఉమ్మడి జిల్లాకు రైల్వే అభివృద్ధి పనులు సాధించారు. ఇదే అభివృద్ధి నినాదంతో ఆయన ప్రజల ముందుకు వెళ్లారు. మరోసారి పట్టం కట్టాలని వేడుకున్నారు. అటు కేసీఆర్ కూడా కరీంనగర్‌లో ప్రచారానికి వెళ్లిన సందర్భంగా…ఫెడరల్ సమాఖ్య ప్రభుత్వం ఏర్పడితే వినోద్ కేంద్రమంత్రి కావొచ్చు అంటూ చెప్పుకొచ్చారు. ఇక, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అన్న నినాదంతో ఆ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ప్రచారం సాగించారు. తెలంగాణ సాధనలో తన పాత్ర ఉందని, ఎంపీగా పనిచేసిన సమయంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓటు వేయాలని వేడుకున్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సానుభూతి ఓట్లతో పాటుగా హిందుత్వ వాదుల ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ హవా నడుస్తుండడంతో, కరీంనగర్‌లో గెలుపు తమదేనన్న ధీమాతో ఆ పార్టీ అభ్యర్థి ఉన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఓటర్లు తమకే అనుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. కాగా, బండి సంజయ్ యువత మొత్తం తనవైపే నిలిచారని విశ్వాసంతో ఉన్నారు. గత ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ వినోద్ కుమార్ మూడు లక్షల పై చీలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈసారి కూడా అంతకు మించి మెజార్టీ సాధిస్తామని ఎన్నికల సమయంలో చెప్పుకొచ్చారు. అయితే, భారీ మెజారిటీ సంగతి ఎలా ఉన్నా, స్వల్ప మెజారిటీతో బయటపడొచ్చని గులాబీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. బీజేపీ అభ్యర్థికి సిరిసిల్ల, వేములవాడతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గాల్లో కొంత ఓటింగ్ శాతం పెరగడమే అందుకు కారణంగా చెబుతున్నారు.

ఎవరికి వారు గెలుపు తమదంటే తమదేనంటున్నారు. కానీ, ఓటర్లు ఎవరివైపు మొగ్గుచాపారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. కరీంనగర్ కోటలో పాగావేసేదెవరో మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *