ఆ ముగ్గురి కంటే జగన్‌కే ఎక్కువ మెజారిటీ వస్తుందా ?

ఆ ముగ్గురి కంటే జగన్‌కే ఎక్కువ మెజారిటీ వస్తుందా ?

హాట్ సెగ్మెంట్స్‌లో అభ్యర్థుల గెలుపోటములు? కీలక నేతల మెజార్టీ లెక్కలపై రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తోంది. ఫలితాలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పందేల జోరు కూడా పెరుగుతోంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొత్త తరహా బెట్టింగ్స్ సాగుతున్నాయి. పార్టీ అధినేతలు, ప్రధాన నేతల మెజారిటీల మీద పందేలు కాస్తున్నారు. ప్రధానంగా కుప్పం, పులివెందుల, మంగళగిరి, హిందూపురం లాంటి నియోజకవర్గాల్లో బెట్టింగ్స్‌ ఎక్కువగా సాగుతున్నాయి. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు, హిందూపురంలో నందమూరి బాలకృష్ణ, మంగళగిరిలో నారా లోకేశ్‌లు బరిలో దిగారు. ఆ ముగ్గురి కంటే పులివెందులలో జగన్‌కే ఎక్కువగా మెజారిటీ వస్తుందని పందెంరాయుళ్లు బెట్టింగ్‌లు వేస్తున్నారట. ఈ తరహా బెట్టింగ్స్ కు వైసీపీ నేతలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారట.

కుప్పంలో చంద్రబాబు గెలుపు కన్నా ఎప్పుడూ మెజారిటీపైనే లెక్కలు సాగుతుంటాయి. గత ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు 47 వేల 121 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక, హిందూపురంలో నందమూరి బాలకృష్ణకు 16 వేల 196 ఓట్ల ఆధిక్యత లభించింది. ఈసారి ఈ మెజారిటీలు పెరుగుతాయా? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. దీని మీదనే ఎక్కువగా బెట్టింగ్స్ సాగుతున్నాయి. మంగళగిరిలో నారా లోకేశ్‌ గెలుపోటములపైనా జోరుగా పందేలు సాగుతున్నాయి. లోకేశ్‌కు 5వేల మెజారిటీ వస్తుందన్న అంచనాల నేపథ్యంలో పందెం జరుగుతోంది.

కుప్పంలో చంద్రబాబు మెజారిటీ పెంచాలని టీడీపీ, తగ్గించాలని వైసీపీ హారోహారోగా పోటీ పడ్డాయి. అదే మాదిరి పులివెందులలోనూ జగన్ మెజారిటీ పెంచేందుకు వైసీపీ, తగ్గించేందుకు టీడీపీ పావులు కదిపాయి. ఇద్దరు సీఎం అభ్యర్థుల్లో ఎవరి మెజార్టీ ఎంత అనేది చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే, లోకేశ్-బాలకృష్ణలు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఈసారి వైసీపీ గట్టి పోటీ ఇచ్చింది. ఈనేపథ్యంలో ఈసారి ఫలితాలు ఏవిధంగా ఉండబోతున్నాయన్నది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. గత ఎన్నికల్లో పులివెందులలో వైఎస్ జగన్‌కు 75 వేల 243 ఓట్ల ఆధిక్యత లభించింది. ఈసారి ఆయన మెజారిటీ పెరుగుతుందని వైసీపీ అంటుంటే, తగ్గుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం మెజారిటీలపై సాగుతున్న ఈ బెట్టింగ్‌లు కౌంటింగ్ తేదీ సమీపించే కొద్దీ మరింత పెరుగుతున్నాయి.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *