కమలనాథుల "ఉనికి"పాట్లు...!

కమలనాథుల "ఉనికి"పాట్లు...!

తెలంగాణలో భారతీయ జనతాపార్టీ తన ఉనికిని చాటుకోవడానికి నానా తంటాలూ పడుతోంది. ఎన్నికలకు ముందు చేయాల్సిన పనులను ఇప్పుడు చేసేందుకు ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్ సర్కారు మీద కత్తులు నూరుతోంది. ఇంటర్ ఫలితాల గందరగోళంపై పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆత్మహత్యలు చేసుకున్న ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ దీక్షను కొనసాగిస్తామని ప్రకటించాడు. పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి నిమ్స్‌కు తరలించారు. అక్కడా నిరాహార దీక్షను కొనసాగిస్తున్నాడు. ఆయన ఆరోగ్యం కొద్దిగా దెబ్బతిందనే వార్తలు వస్తున్నాయి. అయితే బీజేపీ వ్యవహార శైలి “చేతులు కాలాక ఆకులు పట్టకున్న” చందాన ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి, తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని పదే పదే ప్రకటించుకున్న బీజేపీ ఆ స్థాయిలో ప్రజాదరణను పొందడంలో మాత్రం విఫలమవుతోందని అంటున్నారు. ఈ కారణంగానే అసెంబ్లీలో ఆ పార్టీ ఒకే స్థానానికి పరిమితం కావలసి వచ్చిందని అంటున్నారు.

అనుమానమే…

లోక్‌సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని బీజేపీ భావించింది. అందుకే చేరికల మీదా దృష్టి సారించింది. కాంగ్రెస్ నుంచి డీకే అరుణలాంటి నేతలు ఒకరిద్దరు వచ్చి చేరినా…ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదంటున్నారు. కరీంనగర్, సికింద్రాబాద్ సీట్ల మీద వారు భారీ ఆశలే పెట్టుకున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, సికింద్రాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేశారు. అధికార పార్టీ అభ్యర్థులకు వీరిద్దరూ గట్టి పోటీ ఇచ్చారనే అంటున్నారు. అయితే ఫలితం మాత్రం వీరిద్దరూ గెలిచేస్థాయిలో ఉంటుందా అంటే… అనుమానమేనంటున్నారు. అటు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయాయి. ఇటు లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ పూర్తైంది. ఇప్పుడు హడావుడి చేసి ప్రయోజనం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు రాష్ట్ర బీజేపీకి చెందిన కీలక నాయకుల మధ్య ఉన్న విబేధాలే ఈ పరిస్థితికి కారణమనే అభిప్రాయాలూ ఉన్నాయి. అటు అధిష్టానమూ ఏమీ చేయలేక చేతులెత్తేసిందని అంటున్నారు. జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్న నేతలు పార్టీకి ఇక్కడ జవసత్వాలు నింపాలని యత్నించినా కుదరడం లేదంటున్నారు. దీంతో పార్టీ శ్రేణులు కూడా ఢీలా పడి పోతున్నాయనీ, తమను నడిపించే నాయకుడు లేకపోవడంతో దిక్కులు చూస్తున్నాయనీ పేర్కొంటున్నారు..

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *