ఏపీ బీజేపీని అస్సలు పట్టించుకోని మోదీ

ఏపీ బీజేపీని అస్సలు పట్టించుకోని మోదీ

తాజా ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యేకానీ, ఎంపీ సీటుకానీ గెలవలేదు. పలుచోట్లు డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఎందుకీ దుస్థితి దాపురించింది బీజేపీకి. అసలు నేతలు పార్టీ ఎజెండా మేరకు నడుచుకోలేదా… లోపాయికారీ అవగాహనలతో అసలుకే ఎసరు తెచ్చుకున్నారా… కేబినెట్‌ విస్తరణలో మోదీ ఏపీని ఎందుకు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏపీ బీజేపీ నేతల పరిస్థితేంటి.?

తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన బీజేపీ నేతలు 2014 ఎన్నికల తర్వాత కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటయినా కీలకమైన పదవులు పొందలేకపోయారు.. ఒక్క వెంకయ్యనాయుడు తప్ప. ఆయన్ని కూడా కేంద్ర మంత్రి పదవి నుంచి పక్కకు తప్పించి, ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టారు అత్యంత వ్యూహాత్మకంగా.

ఈసారి పరిస్థితి మరీ దారుణం. ఏపీ బీజేపీ నేతల్ని అధిష్టానం అస్సలే మాత్రం పట్టించుకోలేదు. ఒక్క అసెంబ్లీ సీటుగానీ, ఒక్క పార్లమెంటు సీటుగానీ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి దక్కకపోవడంతో సహజంగానే అధిష్టానం నుంచి ఆ స్థాయిలో అసహనం కన్పిస్తుంటుందనుకోండి.. అది వేరే విషయం. అయినాగానీ, ఓ రాష్ట్రానికి పూర్తిగా కేంద్ర క్యాబినెట్‌లో ప్రాతినిథ్యం కల్పించకపోవడమంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే.

పైగా, ఏపీని ప్రధాని నరేంద్రమోదీ చిన్న చూపు చూస్తున్నారనే విమర్శలు గత ఐదేళ్ళపాటు విన్పించాయి.. ఇకపై మరింత ఎక్కువగా విన్పించబోతున్నాయి కూడా. కంభంపాటి హరిబాబు కావొచ్చు, సోము వీర్రాజు కావొచ్చు, విష్ణుకుమార్‌ రాజు కావొచ్చు.. ఇంకొకరు కావొచ్చు.. ఏపీలో బీజేపీ వాయిస్‌ని చాలా గట్టిగా విన్పించారు. కన్నా లక్ష్మినారాయణ లాంటోళ్ళయితే రాజకీయ దాడుల్నీ ఎదుర్కొన్నారు. కానీ, ఎవర్నీ అధిష్టానం కేంద్ర మంత్రి వర్గ ఏర్పాటు విషయంలో పరిగణనలోకి తీసుకోలేదు.

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో ఓ వర్గం టీడీపీకి మద్దతిస్తే, ఇంకో వర్గం వైఎస్సార్సీపీ వెంట, మరికొందరు జనసేన వెంట చీకటి స్నేహాలు నడిపాయనే నివేదికలు అయితే అధిష్టానం దగ్గర వున్నాయట. ఆ కారణంగానే ఏపీ బీజేపీ నేతల్ని మోదీ కావొచ్చు, అమిత్‌ షా కావొచ్చు లైట్‌ తీసుకున్నారన్నది ఓ బలమైన వాదనగా కన్పిస్తోంది.

ఇదిలా వుంటే, తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లను గెలిచిన బీజేపీ, అక్కడి నుంచి ఒకరికి కేంద్ర సహాయ మంత్రిగా అవకాశమిచ్చింది. ఆ అదృష్టవంతుడు ఇంకెవరో కాదు కిషన్‌ రెడ్డి. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఖచ్చితంగా బలోపేతమవుతాం.. అని రఘురామ్‌, విష్ణువర్ధన్‌ తదితర బీజేపీ నేతలు చెబుతున్నా, బీజేపీ జాతీయ నాయకత్వం ఏపీని అస్సలేమాత్రం పట్టించుకోని దరిమిలా.. బీజేపీకి ఏపీలో ‘స్టేక్‌’ ఇప్పట్లో సాధ్యమయ్యే ఛాన్సే లేదు. ఇదే పరిస్థితి ముందు ముందు కూడా కొనసాగితే, 2024 నాటికి బీజేపీ జెండా ఆంధ్రప్రదేశ్‌లో కన్పించడం కూడా కష్టమే..’ అని రాజకీయ విశ్లేషకులు
అభిప్రాయపడుతున్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *