తొలిసారి వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బొత్స

తొలిసారి వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బొత్స

ఏపీలో శాసనసభలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ శాసనసభలో ప్రవేశపెట్టారు. కౌలు రైతులకు మేలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపిన బొత్స.. రైతులకు దీర్ఘకాలంగా మేలు చేసేలా ముందుకు సాగుతున్నామన్నారు. మొత్తం వ్యవసాయ బడ్జెట్ ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు కేటాయించినట్లు తన ప్రసంగంలో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు మంత్రి బొత్స సత్యానారాయణ… ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఆయన వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. మొదట ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టగా… అనంతరం బొత్స వ్యవసాయ బడ్జెట్‌ ప్రతిపాదనలను శాసనసభ ముందు ఉంచారు. సుదీర్ఘ పాదయాత్రలో సీఎం జగన్‌ రైతుల కష్టాలు చూసి చలించారు. మేనిఫెస్టోను బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతగా భావించి అమలు చేస్తాం. కౌలు రైతులకు మేలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విపత్తులు వచ్చినప్పుడు రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నాం. ప్రభుత్వ రాయితీలు అందించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తాం. రైతులకు దీర్ఘకాలంగా మేలు చేసేలా ముందుకు సాగుతున్నామని, రైతుల సంక్షేమానికి అంకితమవుతున్నామని తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు బొత్స.

వ్యవసాయ బడ్జెట్.. కేటాయింపులు:
* మొత్తం వ్యవసాయ బడ్జెట్: రూ.28,866.23 కోట్లు
* రెవెన్యూ వ్యయం: రూ.27,946.65 కోట్లు
* పెట్టుబడి వ్యయం: రూ.919.58 కోట్లు
* వైఎస్ఆర్ రైతు భరోసాకు రూ.12,500 కోట్లు
* రైతులకు పెట్టుబడి సాయానికి రూ.8,750 కోట్లు
* అక్టోబర్ నుంచి పెట్టుబడి సాయం అందజేత
* వైఎస్ఆర్ రైతు బీమాకు రూ.100 కోట్లు
* ఉచిత పంటల బీమా పథకానికి రూ.1,163 కోట్లు
* ధరల స్థిరీకరణ నిధికి రూ. 3 వేల కోట్లు
* జీరో బడ్జెట్ వ్యవసాయానికి రూ.91 కోట్లు
* జాతీయ ఆహార భద్రత మిషన్‌కు రూ.141 కోట్లు
* పొలం బడికి రూ.89 కోట్లు
* వ్యవసాయ యాంత్రీకరణకు రూ.420 కోట్లు
* భూసార పరీక్ష నిర్వహణకు రూ.30 కోట్లు
* వ్యవసాయ మౌలిక వసతులకు రూ.349 కోట్లు
* రైతులకు రాయితీ విత్తనాలకు రూ.200 కోట్లు
* విపత్తు నిర్వహణ నిధికి రూ.2,002 కోట్లు
* ప్రమాదవశాత్తు రైతు మృతిచెందితే రూ.7 లక్షలు
* ఉద్యానవన శాఖకు రూ. 1532 కోట్లు
* ఆయిల్‌ ఫాం రైతులకు ధరల్లో వ్యత్యాసం తగ్గించేందుకు అదనంగా రూ.80 కోట్లు కేటాయింపు
* ఉద్యాన పంటల సమగ్రాభివృద్ధికి రూ.200 కోట్లు
* రైతులకు తుంపర, బిందు సేద్య పథకాల కోసం రూ.1105.66 కోట్లు
* సహకార రంగం అభివృద్ధి కోసం రెవెన్యూ వ్యయం రూ.174.64 కోట్లు
* రైతులకు సహకార స్వల్ప కాలిక రుణాలకు రూ.12వేల కోట్లు
* రైతులకు సహకార దీర్ఘకాలిక రుణాలకు రూ.1500 కోట్లు
* కౌలు రైతులకు రూ.1200 కోట్లు

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *