ధోనీని కాపాడండి

ధోనీని కాపాడండి

ధోనీ… ఈ పేరే ఒక సంచలనం. పొడవాటి జుట్టుతో టీం ఇండియాలోకి వచ్చి దశాబ్దన్నర పాటు క్రికెట్‌ సామ్రాజ్యాన్ని ఏలాడు. అరుదైన వికెట్‌ కీపర్‌గా, అత్యుత్తమమైన కెప్టెన్‌గా, ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. టీం బలానికి తన తెలివితేటలను జోడించి ఎన్నో అపూర్వమైన విజయాలను టీం ఇండియాకు అందించాడు. క్లిష్ట సమయాల్లోనూ తనదైన శైలిలో స్పందిస్తూ, సరైన ఎత్తుగడలతో మిస్టర్‌ కూల్‌గా పేరు తెచ్చుకున్నాడు. దాదాపు దశాబ్దం పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ధోనీ జపం చేశారు. కానీ కొంత కాలంగా ఈ ప్రభావంలో మార్పులొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ధోనీపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో కొందరు సీనియర్లు ధోనికి అండగా నిలుస్తున్నారు. దీనిపై ఓ లుక్కేద్దాం పదండి.

అప్పుడు… ఇప్పుడు…

అప్పుడు ధోనీ అంటే వేగం. క్రీజ్‌లో ధోనీ ఉన్నాడంటే భరోసా. హెలికాఫ్టర్‌ షాట్ల కోసం కళ్లు పెద్దవి చేసుకుని చూసే ప్రేక్షకులు. అత్యుత్తమ ఫినిషర్‌. చివరి ఓవర్లలో ఎలాంటి బౌలర్‌కైనా వణుకు పుట్టిస్తాడనే నమ్మకం. కానీ కొంతకాలంగా ధోనీలో అంతటి వేగం లేదు. క్రీజ్‌తో ధోనీ ఉంటే భరోసాకు బదులు భయం మొదలైంది. అటు స్పిన్నర్లనూ, ఇటు సీమర్లనూ ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ధోనీ త్వరగా అవుటైతే స్కోర్‌ వేగం పెరుగుతుందేమోనని ప్రేక్షకులు ఆశపడేలా… ఆటతీరు మారిపోయింది. ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకూ 223 పరుగులు చేసినా, అత్యల్పమైన స్ట్రైక్‌రేట్‌ను నమోదు చేశాడు.

పెదవి విరుస్తున్నారు…

ఒకప్పుడు ఆకాశానికి ఎత్తినవారే, ఇప్పుడు పెదవి విరుస్తున్నారు. ధోనీ అంతట ధోనీనే తప్పుకుంటే మంచిదని సలహాలూ ఇస్తున్నారు. ఆటతీరుపై పెదవి విరుస్తున్నారు. సరిగ్గా ఇలాంటి క్లిష్టసమయంలోనే ధోనీకి సీనియర్లు అండగా నిలుస్తున్నారు. విమర్శలతో కుంగదీయకూడదనీ, సానుకూల వాతావరణాన్ని కలిపిస్తూ ధోనీని కాపాడుకోవాల్సిన సమయమనీ వ్యాఖ్యలు చేస్తున్నారు. “నేను గతంలో చాలా సార్లు చెప్పాను. అదేఇప్పుడూ చెప్తున్నాను. దిగ్గజ క్రికెటర్ల ఆటతీరుపై సందేహాలొద్దు. ధోనీ ఓ దిగ్గజం. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఫినిషర్. వరల్డ్‌కప్‌లో ప్రస్తుతానికి ధోనీ మెరుపులు లేకుండానే భారత్ జట్టు విజయాలు సాధిస్తోంది. ఈ సాకుతో నిర్లక్ష్యంగా అతడ్ని దూరం చేసుకోవడం పొరపాటు. టోర్నీలో తర్వాత జరగనున్న సెమీస్‌లో, ఫైనల్‌లో అతడి అవసరం టీమ్‌కి రావొచ్చు. క్లిష్ట పరిస్థితుల్లో టీమిండియాని ధోనీ గెలిపించగలడు. అతడిని కాపాడుకోకపోతే టీం ఇండియాకు చాలా నష్టం” అంటూ మైకేల్ క్లార్క్‌ ధోనీకి అండగా నిలిచాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *