విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మావోల కలకలం

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మావోల కలకలం

తూర్పు, విశాఖ సరిహద్దుల్లో మావోయిస్టులపై పోలీసులు గురిపెట్టారా? సీనియర్ నేతలు చలపతి, అరుణ, నవీన్‌ మకాం ఈ ఏరియాలోనే మకాం వేశారా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. పక్కా సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఒడిశా, ఏపీ పోలీసులు ఉమ్మడి ఆపరేషన్ కు ప్లాన్ చేశారు.

విశాఖ ఏజెన్సీ, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదిలికలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మావోయిస్టుల అగ్రనేతలు మకాం వేశారనే సమాచారంతో పోలీసు బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. స్టేట్‌ కమిటీ సభ్యుడు రామచంద్రరెడ్డి అలియాస్‌ చలపతి, ఆయన భార్య ఎస్‌జడ్‌సీ సభ్యురాలు అరుణ, జిల్లా కమిటీ మెంబర్ బోడా అంజయ్య అలియాస్‌ నవీన్‌ 15రోజులుగా గిరిజనులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం లభించడంతో ప్రత్యేక బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి.

మరోవైపు విశాఖ ఏజెన్సీలో కూంబింగ్‌ విస్తృతం కావడంతో మావోయిస్టు అగ్రనేతలు కొంతకాలంగా ఛత్తీస్‌గఢ్‌ను సురక్షిత ప్రాంతంగా ఎంచుకున్నారు. అప్పుడప్పుడు సరిహద్దుల్లోకి వచ్చినా ఒకట్రొండు రోజుల్లో వెళ్లిపోవడం మినహా ఇక్కడ ఉండి కార్యకలాపాలు నిర్వహించింది లేదు. మావోయిస్టు స్టేట్‌ కమిటీ సభ్యుడు చలపతి 2018 అక్టోబరులో విశాఖ ఏజెన్సీకి వచ్చారని, మళ్లీ 15 రోజుల కిందట చలపతి, అరుణ, నవీన్‌ వచ్చారని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

పనసలొద్ది అటవీ ప్రాంతంలో గిరిజనులతో సమావేశమైనట్టు సమాచారం. ఏపీఎఫ్‌డీసీ కాఫీ తోటలను గిరిజనులకు పంపిణీ చెయ్యాలని సంస్థ అధికారులను ఈ సందర్భంగా మావోయిస్టు అగ్రనేతలు హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతోంది.

ఇక సప్పర్ల పరిసర ప్రాంతాల్లో చలపతి బైక్‌పై సంచరించినట్టు తెలుస్తోంది. తాజాగా చలపతి, అరుణ, నవీన్‌తోపాటు మరో 20మంది దళసభ్యులు గిరిజనులతో సమావేశాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారని పోలీసు అధికారులకు పక్కా సమాచారం వచ్చింది. మావోయిస్టు నేతలను కలిసి వస్తున్న సీలేరు ఏపీ జెన్‌కో హోంగార్డులను జీకేవీధి పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. వారివద్ద కీలక సమాచారం లభించడంతో అగ్రనేతలు సరిహద్దుల్లోనే మకాం వేశారని ధ్రువీకరించుకున్నట్టు సమాచారం.

మావోయిస్టు అగ్రనేతల కోసం తూర్పుగోదావరి, విశాఖపట్నం సరిహద్దు ప్రాంతాల్లో సుమారు 3 కంపెనీల ప్రత్యేక బలగాలు వారం రోజులుగా గాలింపు నిర్వహిస్తున్నాయి.మొత్తానికి అగ్రనేతలు తరలిరావడం వెనుక భారీ వ్యూహం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవైపు కూంబింగ్‌ నిర్వహిస్తున్నా గిరిజనులతో మావోయిస్టులు విస్తృతంగా సమావేశాలు నిర్వహించడం పోలీసులకు సవాలుగా మారింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *