ప్రధాని మనిషన్నాడు...తాట తీశారు

ప్రధాని మనిషన్నాడు...తాట తీశారు
పనికొచ్చే ఆలోచనలు చేసేవారికంటే వెధవ తెలివితేటలతో తిరిగేవారు ఎక్కువైపోయారు ఈ మధ్య. ఎక్కడైనా ఏదైనా తప్పు చేస్తే ఎవరో ఒకరి పెద్దవాళ్ల పేర్లు చెప్పి తప్పించుకోవడం అలవాటు చేసుకున్నారు కొందరు. దొరక్కుండా ఉంటే ఎన్నేళ్లైనా కులాసాగా ఉండొచ్చు గానీ, ఒక్కసారి దొరికితే మటుకు దబిడి దిబిడే…అలా దొంగ ఐడీలను చూపించి ఎవరేం చేసుకోలేరు అని తిరిగిన వ్యక్తికి మద్రాస్ పోలీసులు బడితెపూజ చేశారు.

యాక్సిడెంట్‌తో ఆగకుండా…

మద్రాసు హైకోర్ట్ క్యాంపస్‌లో కార్ యాక్సిడెంట్ జరిగింది. బైకు మీద వెళ్తున్న ఒక లాయర్‌ను రాంగ్ రూట్‌లో వచ్చిన కారు ఢీకొట్టింది. లాయర్‌కు గాయాలయ్యాయి. యాక్సిడెంట్ అనే భయంతో కారు డ్రైవర్ కారుని ఇంకా వేగంగా పోనిచ్చాడు. అలా వెళ్తున్న క్రమంలో మరో ఇద్దరిని కూడా ఢీకొట్టాడు. వాళ్లకు కూడా గాయాలయ్యాయి. పోలీసులు కారుని ఆపి డ్రైవర్‌ను, కారులో వెనుక కూర్చున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతను తన పేరు ఎం. ప్రసాద్ అనీ, బెంగళూరులో ఉంటున్నట్టు చెప్పాడు. అక్కడితో ఆగకుండా ప్రధానమంత్రి కార్యాలయం తాలూకు అని చెప్పాడు. అలాగే, తన లగ్జరీ కారుపై ఉన్న స్టిక్కర్లను చూపించాడు. కారు అద్దంపై ఒక స్టిక్కర్ PMO అని ఉండగా…మరొకటి ఏకంగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ, ఇంటర్‌పోల్ అని ఉండటం చూసి పోలీసులు షాక్ అయ్యారు. దీంతో అతను నిజంగా ప్రధాని కార్యాలయానికి చెందిన మనిషేనా అని డౌట్ వచ్చింది.
 
Fake PMO official
 
అతను అక్కడితో ఆగకుండా PMOలో అసిస్టెంట్ కమీషనర్-ప్రోటోకాల్ అని చెప్పాడు. దానికి సాక్ష్యంగా ఐడీ కార్డుని కూడా చూపించాడు. ఆ కార్డుపై ర్యాంక్ A ఆఫీసర్ అని ఉంది. ఐడీ కార్డు చూపించి జంప్ అవ్వాలని చూసిన అతన్ని పోలీసులు ఆపి… PMOకి ఫోన్ చేసి ప్రసాద్ గురించి అడిగారు. అతను చెప్పినదంతా అబద్దమని తెలీంది.ఒక ట్రావెల్ సంస్థ నిర్వహిస్తున్న ప్రసాద్ ఫేక్ ఐడీలతో చెలామణి అవుతున్నాడని నిర్ధారణ అయింది.అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్ట్ జ్యుడీషియల్ రిమాండ్‌కి తరలించారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *