చంద్రబాబుకు మాయ, మమత చుక్కలు చూపిస్తున్నారా?

చంద్రబాబుకు మాయ, మమత చుక్కలు చూపిస్తున్నారా?

కౌంటింగ్‌ సమయం దగ్గరపడుతున్న వేళ, విపక్షాల కూటమిలో సీట్ల లెక్కలు మొదలయ్యాయి. ముఖ్యంగా ప్రధాని అభ్యర్థిత్వం అంశం కూటమిలో హాట్‌ టాపిక్‌గా మారింది. కరవమంటే కప్పకు కోపం, విడమంటే పాముకు కోపమన్నట్టుగా కూటమిలో నేతల తీరు ఉంది. ప్రధాని రేసులో ఉన్న ఆ ఇద్దరూ, ఫలితాలకు ముందే బీజేపీ వ్యతిరేక కూటమి సమావేశం నిర్వహించాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలకు బ్రేకులు వేస్తున్నారట. ఇప్పుడే ఎందుకలే, రిజల్ట్ వచ్చాక చూసుకుందామని చెబుతుండడంతో, ఆయన ఇరుకునపడిపోయారట. మరి, హస్తిన రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆనేత ప్రయత్నాలు ఫలిస్తాయా?

విపక్షాల కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వం రచ్చ అవుతోంది. ఫలితాల తర్వాతే ప్రధాని ప్రకటన ఉంటుందని కూటమి నేతలు చెబుతున్నప్పటికీ, తెరవెనుక మాత్రం ఎవరికి వారుగా పావులు కదుపుతున్నారు. మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 23పార్టీలతో కూడిన విపక్షాల కూటమిలో ప్రధాని పదవి కోసం ముందు వరుసలో రాహుల్ ఉండగా, ఆ తర్వాత మమత, మాయాలు రేసులో ఉన్నారు. అన్నీ కలిసొస్తే, బీజేపీ వ్యతిరేక కూటమి నుంచి ప్రధాని కావాలన్నది వారి లెక్కగా ఉంది. మోదీని గద్దె దించడమే లక్ష్యమంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు – కూటమిలో పెద్దన్న పాత్ర పోషించాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే, చంద్రబాబు బీజేపీ వ్యతిరేక పక్షాల సమావేశం డేటును కూడా అనౌన్స్ చేశారు. అయితే మాయావతి, మమతా బెనర్జీలు చంద్రబాబుకు ప్రతిపాదనను నిరాకరించారని సమాచారం.

కేంద్రంలో వచ్చేది సంకీర్ణ సర్కారేనన్న టాక్ బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్‌తో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మమత, మాయా రెడీగా లేరట. ఈనేపథ్యంలోనే ఆ ఇద్దరు డైనమిక్ లీడర్స్ పలు షరతులు పెడుతున్నారట. కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మాత్రమే మద్దతును ఇవ్వాలని అంటున్నారట. కాంగ్రెస్ తో కలసి కూటమి అంటే, రాహుల్ గాంధీనే ప్రధాని అవుతాడు. అప్పుడు వీళ్లు కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కలన్నింటితోనూ.. మాయా, మమతలు ఢిల్లీ మీటింగ్‌ విషయంలో కాస్త తర్జన భర్జన పడుతున్నారట. బీజేపీ వ్యతిరేక కూటమి అంటూ ఏర్పడితే దానికి తామే హెడ్ అని కరాఖండిగా చెప్పేస్తున్నారట. మమత, మాయాల తీరు కారణంగా, ఇతర పార్టీలు ఎంత వరకు కూటమిలో నిలబడతాయనేది కూడా సందేహంగా మారినట్టు సమాచారం. ఒకవేళ విపక్షాల కూటమిలో గనుక తమకు అవకాశం రాకపోతే, మమత-మాయావతి ఆ కూటమిలో ఉండటానికి పెద్దగా ఇష్టపడరన్నది విశ్లేషకుల అభిప్రాయం.

కాంగ్రెస్, మిగిలిన పార్టీలను సమన్వయం చేసి ముందుకు నడిపించాలని చంద్రబాబు భావిస్తున్నారు. కాంగ్రెస్ 150కి పైగా ఎంపీ సీట్లను సాధించుకుంటే ప్రధాని పీఠాన్ని కూటమిలోని మరెవరికీ వదలదు. మరోవైపు, మాయావతి కూడా ఫలితాలు వచ్చాకా రూటు మార్చి బీజేపీకి సపోర్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి విషయంలో చంద్రబాబు నాయుడి గేమ్ ప్లాన్స్ సాగేలా కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. రాహుల్‌కు మద్దతుగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారనే అనుమానంతోనే మమతా, మాయావతిలు అంగీకరించలేదనే ప్రచారం జరుగుతోంది.

తుది దశ ఎన్నికలు జరిగే లోపు, మరోసారి మిగిలిన పార్టీలను కలిసి సమావేశం ఏర్పాటు గురించి చర్చించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *