ముగ్గురు మహిళలు... మూడు చెరువుల నీళ్లు..

ముగ్గురు మహిళలు... మూడు చెరువుల నీళ్లు..

పాపం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని తిరిగి అధికార పీఠం మీద నిలపడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. కాలికి బలపం కట్టుకుని దేశమంతా తిరుగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో తన నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ… ముగ్గురు వనితలు మాత్రం మోడీని ముప్పు తిప్పలు పెడుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీనిపై ఓ లుక్కేద్దాం పదండి.

ఆ ముగ్గురూ…

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ… ఈ ముగ్గురూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మీద విరుచుకు పడుతున్నారు. ఆయన విమర్శలకు దీటుగా కౌంటర్ ఇస్తూ మోడీని ఊపిరి సలపకుండా చేస్తున్నారని కమలనాథులే చెబుతున్నారు. మోడీని ఎట్టి పరిస్థితులలోనూ తిరిగి ప్రధాని కానివ్వబోనని మమత శపథాలు చేస్తుంది. ప్రధాని మోడీ మీద పదునైన విమర్శలను మాయావతి గుప్పిస్తున్నారు. మోడీ అసలు ఈబీసీలకు చెందిన నేత కానే కాదని, బీసీ అయి ఉంటే ఆర్ఎస్ఎస్ ఆయన్ని ప్రధానమంత్రి కానిచ్చేదే కాదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పేద ప్రజల పట్ల మోడీకి ప్రేమ లేదని మండిపడ్డారు. అసలు ఆయన ప్రధాని పదవికి అనర్హుడని తేల్చేశారు.

ఇక కాంగ్రెస్ పార్టీ తమ తురుపుముక్కగా భావిస్తున్న ప్రియాంకా గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ మీద వాగ్బాణాలు విసురుతూనే ఉన్నారు. తాము అధికారంలోకి వచ్చాక తన భర్త రాబర్ట్ వాద్రాను జైలుకు పంపిస్తామని ప్రకటించిన మోడీ మీద ప్రియాంక గట్టిగానే మండిపడ్డారు. పనికిరాని విషయాలు మాట్లాడడం మానేసి, దేశానికి అవసరమైన అంశాల మీద దృష్టి సారించాలని ప్రియాంక మెత్తగా ప్రధానికి హితవు పలికారు. మోడీ ఈ ఐదేళ్లలో కనీసం ఐదు నిమిషాలు అయినా దేశంలోని పేదల గురించి, పేదరికం గురించి ఆలోచించారా…? అంటూ నిలదీశారు. నిజానికి మోడీ చాలా భయస్థుడని ఎద్దేవా చేశారు. ఇలా ముగ్గురు మహిళా నేతలు మూడు వైపుల నుంచి విరుచుకు పడుతుంటే మోడీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని అంటున్నారు పరిశీలకులు. బీజేపీ ప్రచార భారాన్ని అంతా ప్రధాని నరేంద్రమోడీతోపాటు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మాత్రమే మోస్తున్నారు. అమిత్ షా బెంగాల్ మీద దృష్టి సారిస్తే… మోడీ యూపీ, బీహార్ తదితర రాష్ట్రాలలో ప్రచారం సాగిస్తున్నారు. ఇతర బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో వీరిద్దరి దరిదాపుల్లోనూ లేరు. విపక్షాల మాటల దాడులను వీరిద్దరే సమిష్టిగా తిప్పికొడుతున్నారని అంటున్నారు. ఇంత చేస్తున్న ముగ్గురు మహిళలు విమర్శలు, మాటల తూటాలు మాత్రం ప్రధాని నరేంద్ర మోడీని నిద్రకు దూరం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *