కళకళలాడే బోటింగ్ కేంద్రం...ఇపుడు వెలవెలబోతోంది

కళకళలాడే బోటింగ్ కేంద్రం...ఇపుడు వెలవెలబోతోంది

అదో పర్యాటక కేంద్రం…పిల్లలు, పెద్దలు అందరూ అమితంగా ఇష్టపడే ప్రదేశం. నిత్యం వందలాది మందితో కిటకిలాడే ప్రాంతం అదీ…అయితే…ఇప్పుడు అక్కడ అంతా నిర్మానుష్యం…టూరిస్టులు లేక బోసిపోతున్నది….ఏంటా పర్యాటక స్పాట్….?ఎక్కడ అది అనుకుంటున్నారా…?అయితే ఈ స్టోరి చూడాల్సిందే…!…..

కరీంనగర్ జిల్లా పర్యాటక రంగానికి పెట్టింది పేరు. జిల్లాకి కొత్తగా వచ్చిన వారెవరైనా.. ఖచ్చితంగా ఎల్.ఎం.డి.రిజర్వాయర్ చూడాల్సిందే. ఎప్పడూ వందలాది మంది పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. ఈ ప్రాజెక్ట్ వద్ద గేట్లకు అతి సమీపంలో బోటింగ్ స్పాట్ ఉండేది. బోటింగ్ కేంద్రం నుంచి రిజర్వాయర్‌ మధ్య ప్రాంతానికి తీసుకెళ్లి వచ్చేవారు. బోటింగ్ మంచి గిరాకీ ఉండేది. పర్యాటకులకు కూడా మంచి ఆహ్లాదకరంగా ఉండేది. ఇక శని, ఆదివారాలు విపరీతమైన రద్దీ కనిపించేది. సెలవు దినాలు, పండుగ సమయాల్లో పర్యాటకుల సంఖ్య పెరిగి ఈ బోటింగ్ కేంద్రం కళకళలాడేది.

అయితే ఇదంతా గతంగానే నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ బోటింగ్ కేంద్రం వెలవెలబోతున్నది. పర్యాటకులు లేక కళావిహీనంగా మారింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా రిజర్వాయర్ ఒడ్డున బోట్లు నిలిపి ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా విహారానికి తిప్పడం లేదు. అయితే దీనికి పలు కారణాలు ఉన్నాయి. బోటింగ్ కేంద్రాన్ని గతంలో ఉన్న చోట నుంచి ఆనకట్టకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంగా తరలించారు. ఈ ప్రాంతంలో రిజర్వాయర్లలో నీరు తక్కువగా ఉండటంతో బోట్ల విహారానికి.. ఈ నీరు సరిపడకపోవటంతో బోటింగ్ ప్రాంతాన్ని మార్చారు. అయితే గేట్ల పక్కనే ఉన్నప్పుడు పర్యాటకులు రావడానికి సులభంగా ఉండేది. కానీ, ఇప్పుడు ఆనకట్ట ఎక్కిన తర్వాత ఇంత దూరం రావాలంటే పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు.

ఈ కారణాలతో స్థానక నేతలు కొత్తగా ఏర్పాటు చేసిన కేంద్రాన్నిఆర్బాటంగా ప్రారంభించారు. పాత బోట్లతో పాటుగా జపాన్‌కు చెందిన అధునాతమైన సూపర్ స్పీడ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఇవన్నీ అలంకార ప్రాయంగా మాత్రమే ఉన్నాయి. ఒకేసారి 50 మంది విహరించేందుకు అనుకూలంగా పెద్ద బోటు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఏ బోటు ప్రస్తుతం ఇక్కడ తిరగడం లేదు. పర్యాటకులకు రావడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో బోట్ల భద్రతకు ముప్పు ఏర్పడింది. పర్యాటక కేంద్రం ఉద్యోగులు కూడా ఎప్పుడో ఒకసారి వచ్చి వీటిని పరిశీలించి వెళుతున్నారు తప్పితే నిత్యం అక్కడ ఉండడం లేదు.

మొత్తానికి పర్యాటక శాఖ అధికారుల అనాలోచిత నిర్ణయం వలన పర్యాటక శాఖ ఆదాయానికి గండిపడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోటింగ్ కేంద్రం విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *