ఒకవైపు గొడవలు..మరోవైపు మొరాయింపులు

ఒకవైపు గొడవలు..మరోవైపు మొరాయింపులు

సిరాచుక్క పడాల్సిన చోట..రక్తం చిందింది.అన్నదమ్ముల్లా మెలిగే గ్రామాల్లో హింస చెలరేగింది.రాళ్లదాడులు,కర్రదాడులు,చొక్కాలు చింపేయడాలు..ఇవీ ఏపీలో కొనసాగిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు నిదర్శనాలు.రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ,వైసీపీ వర్గాల మధ్య జరిగిన దాడులతో పోలింగ్‌ హింసాత్మకంగా జరిగింది.పలు చోట్ల కర్రలు,రాళ్ల దాడులు జరగడంతో సామాన్య జనమే కాదూ రాజకీయ నేతలు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు.

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైంది.అయితే ఏపీలో మాత్రం పోలింగ్ ప్రక్రియ ప్రారంభంకాగానే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి.దీంతో పలు పార్టీల నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలకు దిగడంతో పోలింగ్‌కు ఆలస్యమైంది.ఇక ఈసీ నిర్దేశించిన సమయం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకే పోలింగ్ పూర్తికావాల్సింది.కాని..ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అర్థరాత్రి వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద వేట్‌చేసి ఓటు హక్కను వినియోగించుకున్నారు.

ఇక ఏపీ వ్యాప్తంగా సుమారు 400 పోలింగ్‌ కేంద్రాల్లో అర్థరాత్రి వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగింది.అయితే..సాయంత్రం 6గంటల సమయానికి పోలింగ్‌ కేంద్రాలకు వచ్చినవారందరికీ ఎన్నికల సంఘం అధికారులు ఓటరు స్లిప్పులు జారీచేశారు.దీంతో పశ్చిమగోదావరి,గుంటూరు,నెల్లూరుతో పాటు ప్రకాశం తదితర జిల్లాల్లోని ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద అర్థరాత్రి వరకు క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు.ఇక గడువులోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లందరికీ టోకెన్లు ఇచ్చి..ఓటేసే అవకాశం కల్పించామన్నారు ఎన్నికల అధికారులు.

మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అరకు,పాడేరు,రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.కురుపాం,పార్వతీపురం,సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది.అయితే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఒక్క హింసాత్మక ఘటనా జరగలేదు.దీంతో అక్కడి ఓటర్లు,పోలింగ్ సిబ్బందితో పాటు భద్రతా సిబ్బంది ఊపరిపీల్చుకున్నారు.

మొత్తానికి చూస్తే ఏపీలో సుమారు వందల పోలింగ్ కేంద్రాలలో అర్ధరాత్రి వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది.ముఖ్యంగా ఆరు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.ఇక పలుచోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది.అయితే..కేంద్ర ఎన్నికల పరిశీలకులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *