ఎగ్జిట్ పోల్ మాయాజాలం..!?

ఎగ్జిట్ పోల్ మాయాజాలం..!?

దేశంలో లోక్ సభ ఎన్నికల ఫలితాల అంచనాలు సరికొత్త  ప్రశ్నలను లేవనెత్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని దేశంలోని ప్రముఖ సర్వే  సంస్థలు స్ఫష్టం చేశాయి. బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి ఢిల్లీ గద్దెను నిలుపుకుంటుందని తేల్చిచెప్పాయి. గత ఐదేళ్లలో మోదీ పరిపాలనను నిశితంగా గమనించిన రాజకీయ పరిశీలకులు ఈ అంచనాల పట్ల ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే  దేశంలోని కొన్ని వర్గాల్లో బీజేపీ పాలన పట్ల అసంతృప్తి ఉంది. ఇది ఈసారి ఎన్నికలలో ప్రస్ఫుటమవుతుందని అందరూ భావించారు. కానీ ఫలితాల అంచనాలు వారి అభిప్రాయాలను తలకిందులు చేస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొద్ది రోజుల ముందు తాము 300 సీట్లకు పైగా సాధించి అధికారంలోకి వస్తామని, విపక్షాలు అలా చూస్తూ ఉండిపోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఇప్పుడు సర్వేల అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ఈ అంచనాలు గనుక వాస్తవ రూపం దాలిస్తే అది ఆలోచించాల్సిన విషయమేనంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ బలహీనంగా ఉందన్నది వాస్తవమే అయినా మరీ అంత బలహీనంగా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యూపీలో కాంగ్రెస్ కు మరీ ఒక్క సీటే వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేయడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో  ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలోనూ ఆ పార్టీకి అతి తక్కువ సీట్లు వస్తాయనే అంచనాలు వెలువడడం కూడా గమనించాల్సిన అంశమేనని చెబుతున్నారు. ఢిల్లీలో ఉన్న ఏడు సీట్లను కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి.  అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ కూడా గట్టి పోరాటమే చేసింది. అయినా బీజేపీని తట్టుకోలేకపోయాయా? అన్నఅభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఉత్తర భారతదేశం దాదాపు కమలనాధుల ప్రభావంలోనే ఉందన్న విషయం ఎగ్జిట్ పోల్స్ ద్వారా మరోమారు స్పష్టమైంది. జనతాదళ్, కాంగ్రెస్ సంకీర్ణం అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ బీజేపీ సత్తా చాటుతుందనే విశ్లేషణలు ఆలోచనలో పడేస్తున్నాయి.  మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దేశంలో  సంచలనాన్నే సృష్టించాయని చెబుతున్నారు. ఇంతకీ ఈ 23న అసలు ఫలితాలు ఎలా ఉంటాయి?.. ఎగ్జిట్ పోల్స్ ను నిజం చేస్తాయా.?. తలకిందులు చేస్తాయా?  వేచి చూడాల్సిందేనంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *