ఎట్టకేలకు మాట్లాడిన అద్వానీ!

ఎట్టకేలకు మాట్లాడిన అద్వానీ!

లాల్ కృష్ణ అద్వానీ… ఎల్కే అద్వానీగా దేశ ప్రజలకు కొన్ని దశాబ్దాలుగా పరిచయం ఉన్న నేత. దేశానికి ప్రధాని కావాల్సిన నాయకుడు. బీజేపీని రెండు సీట్లు మాత్రమే గెలవగలిగిన స్థాయి నుంచి ఏకంగా కేంద్రంలో పూర్తీ మెజారిటీతో అధికారం చేపట్టే దాకా బలోపేతం చేసిన రాజకీయ యోధుడు కూడా. అయితే తన శ్రమంతా పెట్టి పార్టీని ఎంతో శక్తివంతంగా తీర్చిదిద్దారు కానీ.. తాను మాత్రం ప్రధాని పదవిని చేపట్టలేకపోయారు. ప్రధాని అవకపోయినా ఆయన పెద్దగా బాధ పడలేదు కానీ… పార్టీలో తనను హఠాత్తుగా కింద పడేసిన తీరువల్ల మాత్రం ఆయన ఎక్కువగానే బాధపడినట్టున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఎప్పుడైతే..బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచారో… అప్పుడే అద్వానీ శకం ముగిసిందనే వాదన వినిపించింది. అయితే అప్పటికప్పుడు పార్టీ మూలాలతో పెనవేసుకున్న నేతను పక్కనపెడితే..ఎక్కడ కొంప మునుగుతుందోనన్న భయంతో బీజేపీ నేతలు ఇన్నాళ్లు ఆయనకు ప్రాధాన్యం ఇచ్చినా.. ఇప్పుడు ఆయనను పూర్తీగా పక్కనపెట్టేశారని తెలిసిపోతోంది.

మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని గాంధీ నగర్ నుంచి వరుసగా ఆరు పర్యాయాలు ఎంపీగా గెలిచిన అద్వానీకి ఈసారి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. అద్వానీ స్థానంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే నామినేషన్ వేసేశారు. ఈ పరిణామాలతో బీజేపీలో తన శకం ముగిసిందన్న భావనకు అద్వానీ వచ్చేశారు. అస్త్రసన్యాసం చేయక తప్పడం లేదన్న విషయం ఆయనకు తెలిసిపోయింది. అంతే… ఏమాత్రం ఆలోచించకుండా.. బీజేపీ ఆవిర్భావ దినోత్సవానికి కాస్తంత ముందుగా సోషల్ మీడియాలో ఆయన తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. మొదట దేశం ఆ తర్వాతే పార్టీ… చివరలో కొన్ని సొంత ప్రయోజనాలు అంటూ అద్వానీ తన బ్లాగ్‌లో చెప్పుకున్నారు. అద్వానీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయాయి. ఈ నెల 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం జరగాల్సి ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అద్వానీ తన అస్త్ర సన్యాసాన్ని ప్రకటిస్తూ..ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తనను ఆరుసార్లు పార్లమెంటుకు పంపిన గాంధీ నగర్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ తన అంతరంగాన్ని తెలియజేశారు అద్వానీ… అందులో క్లుప్తంగానే అయినా చాలా కీలకమైన అంశాలనే ప్రస్తావించారు.

ఈ పోస్ట్ లో అద్వానీ చెప్పిన మాటలేంటంటే… “గాంధీనగర్ ప్రజానిఈకానికి కృతజతలు. 1991 నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిపించారు. నియోజకవర్గ ప్రజల ప్రేమ మద్దతు సంతోషాన్నిచ్చింది. ఏప్రిల్ 6న బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోనుంది. ఇది బీజేపీ శ్రేణులకు ముఖ్యమైన రోజు. ఆత్మపరిశీలనతోపాటు గత జ్ఞాపకాలు భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించాల్సిన రోజు. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా దేశ ప్రజలతో పాటు కోట్లాది మంది బీజేపీ శ్రేణులతో అభిప్రాయాలను పంచుకోవాలని భావిస్తున్నా. 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆర్ఎసెస్‌లో చేరాను. అప్పటినుంచి దేశం కోసం సేవ చేయడం అలవాటుగా మారిపోయింది. రాజకీయ జీవితంలో ‘జన సంఘ్ బీజేపీ’తో ఏడు దశాబ్దాలుగా విడదీయలేని అనుబంధం ఉంది. తొలుత భారతీయ జనసంఘ్ తర్వాత బీజేపీ ఏర్పాటు చేశాం. రెండింటిలో వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నా. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అటల్ బిహారీ వాజ్ పేయితోపాటు పలువురు స్పూర్తిదాయక నేతలతో పనిచేసే గొప్ప అవకాశం లభించింది. తొలుత దేశం తర్వాత పార్టీ చివర సొంత ప్రయోజనాలు అనే స్పూర్తిదాయక సూత్రాన్ని జీవితంలో అన్ని పరిస్థితుల్లో పాటించాను. అలాగే రాజకీయంగా విభేదించేవారిని ఎప్పుడూ శత్రువులుగా చూడలేదు. రాజకీయంగా విభేదించే వారిని ఎన్నడూ దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించలేదు. ప్రతి పౌరుడి స్వేచ్చకు పార్టీ నిబద్దతతో కట్టుబడి ఉంటుంది. రాజకీయంగా కూడా ఇదే విధానం అవలంభించాము. మీడియాతో సహా ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ స్వతంత్రంగా పనిచేయాలి” అని అద్వానీ వెల్లడించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *