లైవ్ టెలికాస్ట్ ఉన్నది జాగ్రత్త!

లైవ్ టెలికాస్ట్ ఉన్నది జాగ్రత్త!

ఒక చిన్న పొరపాటు దశాబ్దాల స్నేహాన్ని మసకబార్చిందా..!ఒక చిన్న తప్పిదం కోట్ల రూపాయల వ్యాపార ఒప్పందాన్ని బయటపెట్టిందా..!యజమాని తప్పుకు ఉద్యోగులపై శిక్ష ఎంతవరకూ సమంజసం.దీన్ని ఎవరు ప్రశ్నిస్తారు..దీనికి ఎవరు జవాబు చెబుతారు…ఎమ్‌డీల దోషాలకు ఎంప్లాయిస్ ఎందుకు పరిహారాన్ని చెల్లించాలి?ఈ ప్రశ్నలకు సమాధానం కంటే ముందు ప్రశ్న వెనక నేపథ్యాన్ని తెలుసుకుందాం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు,తన సన్నిహిత మీడియా సంస్థలో ఇంటర్వ్యూ కోసం వెళ్లారు.ఈ క్రమంలో కార్యక్రమం ప్రారంభానికి ముందు సదరు ఛానల్ ఎమ్‌డీతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు.అయితే వీరిద్దరి సంభాషణ మొత్తం లైవ్ టెలికాస్ట్ అయిపోయింది.కాసేపటి తర్వాత ఒక ఉద్యోగి వచ్చి ఛానల్ ఎమ్‌డీతో ‘ సర్..సర్..మీరు మాట్లాడుతున్నదంతా లైవ్ టెలికాస్ట్ అవుతోంది ‘అని చెప్పాడు.దీంతో ఆ మాటలు విన్న చంద్రబాబుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది.పైగా అది లైవ్ టెలికాస్ట్ కావడం వల్ల ఆ కోపాన్ని అణుచుకోలేక..ఆ ఛానల్ ఎమ్‌డీపై విరుచుకుపడ్డారు.

ఒక దశలో పెద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడినట్టు కూడా సమాచారం.తీవ్ర ఆగ్రహంలో ఉన్న చంద్రబాబు మాట్లాడుతూ ‘నీకు 1500 కోట్ల యాడ్స్ ఇచ్చాను.నన్ను బజారుకు ఈడ్చేలా చేస్తావా?అవతలి వారితో ఎంత తీసుకుని ఈ పనిచేశావు ‘అంటూ నిలదీసినట్టు తెలుస్తోంది.అక్కడితో ఆగకుండా అక్కడే ఉన్న ఉద్యోగులపై కూడా తిట్ల దండకంతో విరుచుకుపడ్డారని అందరూ చెబుతున్న మాట.

ఎన్నో ఏళ్లుగా మైత్రి ఉన్న బాబు,ఆ ఛానల్ యజమానికి మధ్య చిన్న రికార్డ్ వీడియో పెద్ద అగాథాన్ని ఏర్పరిచింది.ఈ వ్యవహారం ఎంతవరకూ దారితీస్తుందో పక్కన పెడితే…తామిద్దరూ మాట్లాడుకున్న సంభాషణ మొత్తం లైవ్ టెలికాస్ట్ అవడానికి కారణమయ్యారంటూ ఏడుగురు ఉద్యోగులను సంస్థ నుంచి పంపించి వేసినట్టు సమాచారం.ఇద్దరూ మాట్లాడుకున్న రికార్డ్ వీడియోలను బయటకు చేరవేసేలా చేసినందుకు ఆ ఏడుగురు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు సంస్థ చెప్పుకొచ్చింది.అయితే..వాళ్లు చేసిన తప్పుకు ఉద్యోగులను బలిచేయడం ఏంటని ఎవరూ ప్రశ్నించకపోవడం కొసమెరుపు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *