కనుమరుగవుతున్న కమ్యూనిస్టులు

కనుమరుగవుతున్న కమ్యూనిస్టులు

స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన కమ్యూనిస్టులు, ప్రస్తుతం మనుగడ కోసం పోరాడక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. వరుస తప్పిదాల కారణంగా వామపక్షాలు ఉనికి కోల్పోతున్నాయి. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులేనన్న భావన నుంచి కనుమరుగయ్యే పరిస్థితికి లెఫ్ట్ పార్టీలు వచ్చాయి. మూడింట రెండు రాష్ట్రాల్లో లెఫ్ట్‌ పట్టు సడలిపోగా…? అధికారంలో ఉన్న కేరళలో కూడా కామ్రేడ్స్‌ను దెబ్బకొట్టేందుకు ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు.

వామపక్షాల్లో పదుల సంఖ్యలో పార్టీలున్నా వాటిలో ప్రధానమైనవి సీపీఎం, సీపీఐ. వామపక్ష కూటమికి పెద్ద దిక్కు సీపీఎం. ఇతర రాష్ట్రాల్లో ఎంతోకొంత ఉనికి చాటుతూ వస్తున్న వామపక్షాలను ఆదరించి, పట్టం కట్టిన రాష్ట్రాలు త్రిపుర, కేరళ, పశ్చిమ బెంగాల్‌. ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో కూడా పార్టీ ప్రభావం చూపలేకపోతుంది. మూడు దశాబ్దాలపాటు త్రిపురను పరిపాలించిన లెఫ్ట్‌ 2018లో అధికారం కోల్పోయింది. అనూహ్యంగా బీజేపీ దూసుకొచ్చింది. బెంగాల్‌లోనూ సీపీఎం పరిస్థితి అయోమయంగా తయారైంది. 1977 నుంచి తిరుగులేని అధికారం చలాయించిన వామపక్షాల ప్రభకు 2011లో మమత బ్రేకులు వేశారు. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్‌ కేవలం 28 స్థానాలకే పరిమితమైంది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ పోరు తృణమూల్‌, బీజేపీ మధ్య సాగుతుందంటే, ఆ పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంమొత్తం మీద లెఫ్ట్‌ అధికారంలో ఉన్నది కేవలం కేరళలో మాత్రమే. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో లెఫ్ట్‌కు ఎన్ని సీట్లు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

వామపక్షాలకు జ్యోతిబసులాంటి బలమైన ప్రజాకర్షణ ఉండే నాయకులు కరువయ్యారు. బుద్ధదేవ్‌ భట్టాచార్యలా శ్రేణుల్లో ఉత్సాహం నింపే వారు కనిపించడంలేదు. ప్రకాశ్‌ కారత్‌ నాయకత్వంలో సీపీఎం ఓటమి పరంపర మొదలుకాగా.. ఇప్పుడు, సీతారాం ఏచూరి హయాంలోనూ పార్టీ పరిస్థితి నామమాత్రంగానే ఉంది. 2004లో వామపక్ష పార్టీలకు 59 మంది ఎంపీలు ఉండేవారు. 2014లో ఆ సంఖ్య 11కు పడిపోయింది. 2009లో పది రాష్ట్రాల నుంచి లెఫ్ట్‌ ఎంపీలు ప్రాతినిధ్యం వహించగా… 2014లో కేవలం 3 రాష్ట్రాల నుంచి మాత్రమే వామపక్ష ఎంపీలు గెలిచారు. కమ్యూనిస్టు పార్టీల్లో లోపించిన ఐక్యత కారణంగానే ప్రభావం చూపలేకపోతున్నాయన్న విమర్శలున్నాయి. వామపక్షాల ఓటు బ్యాంకు అంతా కాంగ్రెస్, బీజేపీ సహా ఇతర పార్టీలవైపు మళ్లిపోతున్నాయి.

1996లో సంకీర్ణాల స్వర్ణయుగంలో కాంగ్రెస్‌, బీజేపీ రెండూ అధికారానికి ఆమడ దూరంలో నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కమ్యూనిస్టులను కాంగ్రెస్ ఆహ్వానించింది. కమ్యూనిస్టు దిగ్గజం జ్యోతిబసుకు పిలిచి ప్రధాని పదవి ఇస్తామన్నా, వామపక్ష నేతలు అందుకు అంగీకరించలేదు. భారతదేశానికి ఓ కమ్యూనిస్టు ప్రధాని అయ్యే అవకాశాన్ని జారవిడుచుకొని, చారిత్రక తప్పిదం చేశామని వామపక్ష పెద్దలు వాపోయారు. నాటి నుండి నేటి వరకు వరుస తప్పిదాలతో వామపక్షాల పరిస్థితి దయనీయంగా మారింది. ఒక్కొక్కటిగా ఎర్రకోట బద్దలవుతున్న వేళ, కమ్యూనిస్టులు మనుగడ కోసం పోరాడక తప్పని పరిస్థితిలు ఏర్పడ్డాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *