కర్ణాటక ప్రభుత్వం కూలడానికి సిద్ధంగా ఉందా?

కర్ణాటక ప్రభుత్వం కూలడానికి సిద్ధంగా ఉందా?
కర్ణాటకలో రాజకీయం రోజుకొక మలుపుతో సంక్లిష్టంగా మారుతోంది. 2018 ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీ కుడా స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. బీజేపీ అత్యధికంగా 103 సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 112 సీట్లకు 9 సీట్ల దూరంలో ఆగింది. అయితే, కేంద్రంలో బీజేపి అధికారంలో ఉండటంతో…స్వతంత్ర అభ్యర్థుల్ని, జేడీఎస్ పార్టీని కలుపుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే భయంతో…కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మద్దతు ఇస్తామని ప్రకటించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే…కాంగ్రెస్ పార్టీ 80 సీట్లు గెలిచింది. జేడీఎస్ కేవలం 37 సీట్లను మాత్రమే సొంతం చేసుకుంది. అయినా సరే, బీజేపీకి అధికారాన్ని ఇవ్వకూడదని కాంగ్రెస్ త్వరగానే మేల్కొని జేడీఎస్ పార్టీకి అధికారాన్ని త్యాగం చేసింది. అప్పటి నుంచి అవకాశం కోసం కాచుక్కూర్చున్న బీజేపీ అదును చూసి అధికారంపై కన్నేసింది.
 
గత కొన్నాళ్లుగా కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ఆదివారం రోజున బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. సోమశేఖర మాట్లాడుతూ..’ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత నెలలు గడుస్తున్నా ఒక్కటైనా అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. గతంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కెంపెగౌడ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేయడం లాంటి భారీ పనులు చేశారు ‘ అని చెప్పారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి కుమారస్వామి ‘ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాటలను ఆ పార్టీ నేతలు గమనిస్తున్నారు. కాంగ్రెస్‌లోని పెద్దలు వారి ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకోవాలి. లేదంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధం. ముఖ్యమంత్రి పదవిపై నాకు ఎటువంటి మోజు లేదు ‘ అని ప్రకటించారు.
 
Karnataka Politics

ఒకరిపై ఒకరు…

ఇదే సందర్భంలో…కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంకీర్ణ ధర్మాన్ని పాటించడంలో కాంగ్రెస్ విఫలం అవుతోందని ఆరోపణలు గుప్పించారు. అయితే, ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలకు కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ స్పందించారు. ‘ మా ఎమ్మెల్యే సోమశేఖర పరిధిని దాటి మాట్లాడారు. తన వ్యాఖ్యల గురించి ముఖ్యమంత్రి కుమారస్వామికి సోమశేఖర క్షమాపణలు చెప్పారని ‘ పేర్కొన్నారు. ఈ పరిణామాలపై సిద్ధరామయ్య మాట్లాడారు. ‘ కుమారస్వామితో చర్చలు జరిపి విభేదాలుంటే పరిష్కరించుకుంటామని ‘ వెల్లడించారు.
 
కాంగ్రెస్-జేడీఎస్ తమ చిక్కుముడులేవో తీసుకుంటుంటే..మధ్యలో బీజేపీ నేతలు దొరికిందే అవకాశంగా విమర్శలతో చెలరేగిపోతున్నారు. ‘ ముఖ్యమంత్రి కుమారస్వామి పదవికి రాజీనామా చేసినా నష్టం ఏమీ లేదని  మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ అంటుంటే…కుమారస్వామికి సిగ్గుంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని మరో నేత ఈశ్వరప్ప సవాలు విసురుతున్నారు.

మాకేం భయం లేదు !

ఈ క్రమంలో…కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి కుమారస్వామికి, రాహుల్‌గాంధీకి మద్య విభేదాలు రావడంతో ప్రభుత్వం పడిపోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో కాంగ్రెస్-జేడీఎస్‌ల నుండి 18 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్టు జాతీయా మీడియాలో వార్తలొచ్చాయి. బయటకు మాత్రం తమ ప్రభుత్వానికి ఏ ఢోకా లేదని చెబుతున్నా…బీజేపీ చేసే దుందుడుకు ప్రవర్తనల వల్ల కుమారస్వామి ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. మీడియా సమావేశాలు పెట్టి మరీ కాంగ్రెస్-జేడీఎస్‌ల మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పే పరిస్థితి వచ్చింది.
 
పైగా స్వతంత్ర అభ్యర్థులు నగేశ్, శంకర్‌లు కాంగ్రెస్-జేడీఎస్ నుంచి బయటకు వచ్చేశారు. త్వరలో బీజేపీలో చేరనున్నట్టు జాతీయ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. దీంతో వేరు మార్గం లేక మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వం పడిపోయే పరిస్థితి కాదని చెప్పుకోవాల్సి వస్తోంది. ఈ పరిణామాలన్నిటికీ పి మురళిధరరావే కారణమని జాతీయమీడియాలో వస్తున్న వార్తలను బట్టి తెలుస్తోంది. కర్ణాటకలో ఏం జరగబోతోంది అనేది వేచి చూడాలి.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *