మ్యాజిక్ అని మునిగాడు.. శవమై తేలాడు

మ్యాజిక్ అని మునిగాడు.. శవమై తేలాడు

మ్యాజిక్‌ పేరుతో ఓ మెజీషియన్‌ ప్రాణాలు కోల్పోయాడు. గతంలో 29 సెకన్లలో తిరిగొచ్చిన చంచల్‌ లాహిరి కోల్‌కతాలోని హుగ్లీనది బ్రిడ్జి వద్ద గంగానదిలో తుదిశ్వాస విడిచారు. ఇనుప బోన్‌లో బంధించుకొని క్రేన్‌ సాయంతో నదిలో దిగిన మెజీషియన్‌ మృతదేహాన్ని బయటకు తీశారు.కోల్‌కతాలోని హూగ్లీ నది బ్రిడ్జి వద్ద మ్యాజిక్ పేరుతో గంగానదిలో దిగిన ప్రముఖ మెజీషియన్ శవమై తేలారు. తన మ్యాజిక్ విద్యలతో జాదుగర్ మంద్రాకేగా గుర్తింపు పొందిన చంచల్‌ లాహిరి తనను తాను ఇనుప బోనులో బంధించుకుని, దానికి తాళాలు వేయించుకుని ఈనెల 16 కిక్కిరిసిన జనం సమక్షంలో క్రేన్ సాయంతో గంగానది నీటిలోకి దిగారు. లాహిరి చెప్పిన ప్రకారం నిమిషం వ్యవధిలోపే ఆయన తిరిగి యథాస్థానానికి రావాల్సి ఉంది. కానీ, ఎంతసేపటికీ ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.దీంతో పోలీసులు ఆయన కోసం నదిలో గాలింపు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు ముమ్మరం చేశారు. సోమవారం సాయంత్రం హౌరా బ్రిడ్జి వంతెన సమీపంలోనే గజ ఈతగాళ్లు ఆయన మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. చంచల్ లాహిరి మృతితో కోల్‌కతాలో విషాదం చోటుచేసుకుంది. అయితే హూగ్లీ నదిపై బోటు విన్యాసం చేయడానికే తాము అనుమతి ఇచ్చామని.. ముందుగా చెప్పినట్లు కాకుండా ఆయన నేరుగా హుగ్లీ నది నీటిలో ప్రయోగం చేశాడని అధికారులు చెబుతున్నారు.

2013లో చంచల్ లాహిరి ఇదే ప్రాంతంలో ఇదే విన్యాసం చేసి 29 సెకన్లలోనే తిరిగొచ్చారు. కానీ అప్పుడు ఆయన చేసిన విన్యాసంపై చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. బోను ఒకవైపు ద్వారాన్ని తెరవడానికి వీలుగా ఉంచుకొని.. విన్యాసం అంటూ ప్రజల్ని బోల్తా కొట్టించారని విమర్శలు వచ్చాయి. తాజాగా ఆయన ఆదివారం మరోసారి అదే విన్యాసం చేపట్టి ప్రాణాలు కోల్పోయారు. ప్రయోగానికి ముందు లాహిరి మాట్లాడుతూ.. కిందటిసారి 29 సెకన్లలో బయటికి వచ్చేశాను. ఈసారి బయటకు రావడం కష్టమే. బయటకు రాగలిగితే మ్యాజిక్‌ అవుతుంది. లేదంటే ట్రాజిక్‌ అవుతుంది అని వ్యాఖ్యానించారు. ఆయన చెప్పినట్లుగా ఆ విన్యాసం ట్రాజెడీగా మారిందని కోల్‌కతా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *