కోడెల ట్యాక్స్...సత్తెనపల్లిలో అనధికార పన్నువసూళ్లు

కోడెల ట్యాక్స్...సత్తెనపల్లిలో అనధికార పన్నువసూళ్లు

ప్రతి పనికి ఓ రేటు. ఇవ్వకుంటే బెదిరింపులు. భూ ఆక్రమణల మొదలు బియ్యం దందా వరకు వారిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం గత పాలనలోని అక్రమాలను బయటకు తీస్తుండడంతో…. కే ట్యాక్స్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్కరుగా బాధితులు బయటకు వస్తుండడంతో…కోడెల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

ఏపీ సీఎం గా వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి..టీడీపీ సర్కారు హయాంలో జరిగిన అక్రమాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ అక్రమాలన్నింటిలోకి స్పీకర్ హోదాలో టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ..ఆయన తనయుడు – కూతురు ట్యాక్స్ వసూళ్లు చేసినట్టు వచ్చిన ఆరోపణలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. కోడెల ట్యాక్స్ పేరిట పాపులర్ అయిన ఈ వ్యవహారంపై…. ఇప్పుడు కొందరు బాధితులు కూడా బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదులు చేశారు. కోడెల కుమారుడు శివరాం, కూతురు విజయలక్ష్మీలపై కేసులు కూడా రిజిస్టర్‌ అయ్యాయి. సత్తెనపల్లి,నరసరావుపేట నియోకజవర్గాల్లో కోడెల ట్యాక్స్ వసూలు చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలే ఆధారంగా కోడెల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

ఇటు కోడెల ఫ్యామిలీ భూ కబ్జాలు, అక్రమ వసూళ్ళు, నిరుద్యోగులకు టోకరా, రేషన్ బియ్యం దందా సహా అనేక అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ కారణంగానే సత్తెనపల్లిలో కోడెల ఓడిపోయాడని చెబుతుంటారు. నరసరావు పేటలో ‘కోడెల ట్యాక్స్’ అనే పేరు కూడా బలంగా ప్రచారంలో ఉంది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కూడా ఇదే అంశం పై సంచలనాత్మక ట్వీట్ చేశారు. ప్రజలు – వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన కోడెల కుటుంబ సభ్యులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు.

మరోవైపు బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. నరసరావుపేట పోలీసుస్టేషన్‌లో ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. గుంటూరు అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావు నిర్వహించిన పోలీస్‌ గ్రీవెన్స్‌లో సత్తెనపల్లికి చెందిన ఓ బిల్డర్‌ కోడెల ట్యాక్స్‌ పై ఫిర్యాదు చేశారు. అపార్టుమెంట్‌ నిర్మాణం అనుమతికోసం తన వద్ద బలవంతంగా 15 లక్షలు వసూలు చేశారని, ఆ డబ్బును వడ్డీతో సహా ఇప్పించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరారు.

తండ్రి అధికారాన్నీ అడ్డు పెట్టుకుని కోడెల కుమార్తె విజయలక్ష్మి చేసిన భూ దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం గద్దె దిగిన తరువాత బాధితులు వరుసగా క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఆమెపై భూ కబ్జా, బలవంతపు బెదరింపు వసూళ్లకు సంబంధించిన కేసులు నమోదుకాగా తాజాగా విజయలక్ష్మిపై మరో కేసు రిజిస్టర్ అయింది.మిగిలిన ఫిర్యాదుల పై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఫిర్యాదుల పరంపర పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *