అరకు ఎంపీగా బరిలో కిషోర్ చంద్రదేవ్, ఆయన కుమార్తె శృతీదేవి

అరకు ఎంపీగా బరిలో కిషోర్ చంద్రదేవ్, ఆయన కుమార్తె శృతీదేవి

ఏపీలో రాబోయే ఎన్నికలు చాలా రసవత్తరంగా మారనున్నాయి. ఇప్పటికే ఒకే కుటుంబంలో వేర్వేరు పార్టీలకు చెందిన వారు ఉండగా.. వారిలో ఒకరిపై మరొకరు పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ కిశోర్ చంద్రదేవ్, ఆయన కుమార్తె శృతీదేవి ఇద్దరు అరకు సీటు కోసం పోటీకి దిగనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి కొడిగట్టిన దీపంలా మారింది. నేతలందరూ తలోదారి వెతుక్కోగా ఒకటీ అరా ఆ పార్టీ జెండాను మోస్తున్నారు. తాజాగా ఎన్నికల్లో పోటీకి తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది.

అరకు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అరకు లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ నుంచి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌ను తన అభ్యర్థిగా టీడీపీ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఆయన కుమార్తెకు సీటు ఖరారు చేసింది. వైరిచర్ల కుమార్తె శృతీదేవిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించగా, ఆమె తన తండ్రిని ఢీకొట్టాలని నిర్ణయించుకున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున గొడ్డేటి మాధవి బరిలో ఉన్నారు. దీంతో అరకు పార్లమెంటులో ఈసారి త్రిముఖ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరినప్పుడే తన కుమార్తె శృతీదేవి ఆమెకు నచ్చిన పార్టీలో ఉన్నారని, రాజకీయంగా ఆమెతో ఎటువంటి సంబంధం లేదని కిషోర్‌ ప్రకటించారు. అంతకు ముందే శ్రుతీదేవి కాంగ్రెస్‌ టిక్కెట్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కిషోర్‌ చంద్రదేవ్‌ కుమార్తె శ్రుతీదేవి లా పూర్తిచేసి ఢిల్లీలో ఉంటున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం స్వచ్ఛంద సేవా సంస్థను నడుపుతున్నా జనంతో అంత కలివిడిగా ఉండరు. మీడియా కంటపడినా కనీసం మాట్లాడరు. ఒకటి రెండు పర్యాయాలు గిరిజన మహిళా సంఘాలతో మాటా మంతి తప్పితే సాధారణ పౌరులతో ఎటువంటి సత్సంబంధాలు లేవు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *