లైంగిక వేధింపులపై పోరాడినందుకు కిరోసిన్ పోసి చంపేశారు!

లైంగిక వేధింపులపై పోరాడినందుకు కిరోసిన్ పోసి చంపేశారు!

బంగ్లాదేశ్‌లో నజ్రత్ జహాన్ రఫీ అనే అమ్మాయి మరణం సంచలనం సృష్టించింది. తను చదువుతున్న మదరసాలో ప్రిన్సిపాల్ శారీరక వేధింపులను ఎదిరించినందుకు నజ్రత్‌ను కొందరు కిరోసిన్ పోసి కాల్చేశారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చూపించింది. అమ్మాయిలను వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఆమెను అతి దారుణంగా చంపేశారు.

నజ్రత్ చెప్పిన వివరాల ప్రకారం…తనను ప్రిన్సిపాల్ ఆఫీస్‌కు రమ్మని పిలిచారని … మాట్లాడుతున్న క్రమంలో ప్రిన్సిపాల్ అసభ్యంగా ప్రవర్తించడంతో భయపడి ఇంటికి వెళ్లిపోయింది. అయితే..ఈ ఘటనను అలాగే వదిలేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. దీనికి కుటుంబ సభ్యులు కూడా అండగా నిలబడటంతో ఆమె పోలీసులకు జరిగినదంతా చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేశారు. అయితే..అక్కడితో ఈ వ్యవహారం ఆగిపోలేదు. ఆ తర్వాత స్థానికంగా ఉండే యువకులు కొందరు నజ్రత్‌ను వేధించడం మొదలుపెట్టారు. ప్రిన్సిపాల్‌పై పెట్టిన కేసుని వెనక్కి తీసుకోవాలని ఆమెని బెదిరించారు. కొందరు రాజకీయనాయకులు కూడా ఇందులో భాగస్వాములై ఇద్దరు విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్‌ను విడుదల చేయాలంటూ ధర్నాలు కూడా చేశారు. ఈ ఘటనలో నజ్రత్‌దే తప్పుందని బుకాయించడం మొదలుపెట్టారు. ఈ బెదిరింపులతో నజ్రత్ కుటుంబం ఆమెకు ప్రమాదం ఉందని భయపడింది.

ఈ క్రమంలో ఏప్రిల్ 6న, ఘటన జరిగిన 11 రోజుల తర్వాత నజ్రత్ మళ్లీ మదరసాకు వెళ్లింది. ఫైనల్ ఎగ్జామ్స్ కోసమని వెళ్లిన తనను కొందరు విద్యార్థినిలు పాఠశాల పైకప్పుకు తీసుకెళ్లారు. అక్కడే నజ్రత్‌ను కొట్టి, ప్రిన్సిపాల్ మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకోవాలంటూ బెదిరించారు. అయినా సరే…కేసుని వెనక్కి తీసుకోవడానికి నిరాకరించడంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఆమెపై దాడి చేసినవారిలో ఒకరు నజ్రత్ తల పట్టుకుని ఉండటం వల్ల తలభాగంలో ఏమీ కాలేదు. కానీ శరీరం మాత్రం 80 శాతం కాలిపోయింది.

ఈ ఘటన గురించి నజ్రత్ సోదరుడు మహమూద్ హసన్ చెబుతూ…’ఫైనల్ పరీక్షల సమయంలో తనతోపాటు నేను కూడా వెళ్లాను. అయితే…నన్ను స్కూల్ ఆవరణంలోనికి అనుమతించలేదు. ఒకవేళ ఆరోజు తనతో పాటు నన్ను కూడా పంపించి ఉంటే ఈ దారుణం జరిగేది కాదని ‘ అని దుఃఖిస్తూ చెప్పాడు. నజ్రత్‌ను కాలిన గాయాలతో ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో ఆమె సోదరుడికి చెందిన సెల్‌ఫోన్‌లో జరిగిన ఘటన గురించి చెప్పింది. ‘ప్రిన్సిపాల్ నా ఒంటిపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. అతనిపై కఠిన చర్యలు తీసుకునేవరకూ…నా చివరిశ్వాస వరకూ పోరాడుతాను అని చెప్పింది. ఆ వీడియోనే ఇప్పుడు ప్రధాన సాక్ష్యంగా నిలిచింది

జరిగిన ఈ దారుణం బంగ్లాదేశ్‌లోని ప్రధాన మీడియాను కుదిపేసింది. ఏప్రిల్ 10న నజ్రత్ మరణించడంతో…ఆమె అంత్యక్రియలకు వేలమంది ప్రజలు తరలి వచ్చారు. ఈ కేసులో పోలీసులు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రిన్సిపాల్‌కు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న ఇద్దరు విద్యార్థులు కూడా ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా…ఢాకాలోని నజ్రత్ కుటుంబాన్ని పరామర్శించారు. నజ్రత్ మరణానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని శిక్షించేలా చర్యలు తీసుకుంటానని మాటిచ్చారు. దోషులెవరైనా చట్టం వదిలిపెట్టదు అని బదులిచ్చారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *