చిన్న చిన్న ఆటో...చిత్రమైన ఆటో!

చిన్న చిన్న ఆటో...చిత్రమైన ఆటో!
పదేళ్ల వయసు దాటే వరకు పిల్లలకు నచ్చినవి కొనివ్వడం తల్లిదండ్రులకు అలవాటు. రకరకాల బొమ్మలు అడుగుతుంటారు పిల్లలు. కొందరు అడిగినవన్నీ కొనివ్వరు, మరికొందరు తర్వాత కొనిస్తామని పిల్లలను నమ్మబలికి ఓదారుస్తారు. కానీ, కేరళలో ఉండే అరుణ్‌కుమార్ అందరిలాంటి తండ్రి కాదు..! తన పిల్లలు అడిగినవి కొనివ్వడం కాదు తనే దగ్గరుండి తయారు చేసి నిజమైనవే ఇస్తాడు. అర్థం కాలేదా మీకు..!? కేరళలో ఉండే అరుణ్‌కుమార్… తన పిల్లలు బొమ్మ ఆటో కొనివ్వాలని మారాం చేస్తే వారికి నిజంగా నడిచే బుల్లి ఆటోను తయారు చేసిచ్చాడు. దానికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు అతని ప్రతిభకు మెచ్చుకుని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

బుల్లి ఆటోను

ఇడుక్కి జిల్లా ఆసుపత్రిలో అరుణ్‌కుమార్ స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల కిందట అరుణ్ పిల్లలు మోహన్‌లాల్ నటించిన ‘అయ్ ఆటో’ సినిమాను చూశారు. అప్పటినుంచి పిల్లలు అరుణ్‌ని ఆటో కావాలని అడుగుతున్నారు. పిల్లల కోరికను కాదనలేకపోయిన అరుణ్…బొమ్మ ఆటో ఎందుకు నిజంగా నడిచే బుల్లి ఆటోను తయారు చేసిస్తే సరిపోతుంది కదా అని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా నిజమైన ఆటో లాగానే ఉండే బుల్లి ఆటోను తయారు చేశాడు. ఆ ఆటోలో మోహన్‌లాల్ ఫోటోను కూడా ఉంచాడు. నిజమైన బుల్లి ఆటోను చూసేసరికి పిల్లల ఆనందానికి హద్దుల్లేకుండాపోయింది. అందులో కూర్చొని…కావాల్సినంతసేపు దాన్ని నడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
 
ఎంచక్కా పిల్లలు ఆటో నడుపుతుంటే సంబరపడుతూ చూస్తుండిపోతున్నాడు అరుణ్‌కుమార్. దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పెట్టడంతో నెటిజన్లకు తెగ నచ్చేసింది. ఆ వీడియోలో ఆటో తయారీ కోసం ఉపయోగించిన పరికరాల గురించి కూడా చెప్పాడు. అరుణ్‌కుమార్ సృజనాత్మకతపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *