ఇద్దరు ముఖ్యమంత్రులు... ఒక్కటే లక్ష్యం...

ఇద్దరు ముఖ్యమంత్రులు... ఒక్కటే లక్ష్యం...

రెండు తెలుగు రాష్ట్రాలు.ఇద్దరు ముఖ్యమంత్రులు. యుద్ధం మాత్రం ఒకే అంశం మీద. ఇంతకీ ఆ అంశం ఏమిటనుకుంటున్నారా…? ఏం లేదు… ప్రభుత్వ శాఖలలో పెరిగిపోయిన అవినీతిని రూపుమాపడం. దీని కోసం ఇద్దరు కంకణం కట్టుకున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల లక్ష్యం ఒక్కటే అయినా ఇద్దరి దారులు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. ఏపీలో సీఎం జగన్ అన్ని శాఖల మీద దృష్టి పెడితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖల ప్రక్షాళనకు పూనుకుంటున్నారు. అవినీతి లెక్కకు మించి ఉందని భావిస్తున్న రెవెన్యూ శాఖను దాదాపుగా రద్దు చేసే ప్రయత్నాలే కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్ చట్టాన్ని ఇప్పటికే కఠినతరం చేశారు. పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని తేలితే సర్పంచులు పదవులు కోల్పోవడమే కాకుండా, జైలుకు కూడా పోయేలా చట్టాన్ని రూపకల్పన చేశారు. పంచాయతీ సమావేశాలు సకాలంలో నిర్వహించకపోయినా, పన్నులు సకాలంలో వసూలు చేయకపోయినా వారికి పదవీ గండం తప్పదు.

నిజాయితీగా..ప్రజాపక్షం ఉండాలి!

కొత్త చట్టం అంత కఠినంగా ఉంది! దీనిని అధికారులు తూ.చా తప్పకుండా అమలు చేస్తే సర్పంచులకు తిప్పలు తప్పకపోవచ్చు. ఇప్పుడు పురపాలక చట్టాన్ని కూడా అంతే కఠినంగా రూపొందించాలని కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారని చెబుతున్నారు. నిబంధనల రూపకల్పనలో కాస్త మనసు పెట్టి పని చేయాలని ఆయన అధికారులకు సూచించినట్టుగా వార్తలు వచ్చాయి. దీనిని బట్టి సీఎం ఈ మూడు విభాగాల మీద ఎంత కఠినంగా ఉండదలచుకున్నారో స్పష్టమవుతోందని అంటున్నారు. ఈ క్రమంలోనే, తెలంగాణలో కొత్తగా ఎన్నికైన 32 మంది జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లకు మంగళవారం కేసీఆర్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి ఆయన పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల పాలన నిజాయితీగా కొనసాగాలని, చేపట్టే కార్యక్రమాలన్నీ ప్రజా పక్షంగా ఉండాలని ఆదేశించారని చెబుతున్నారు.

తేడా వస్తే మంత్రి పదవికి ఎసరు…

పాలన సక్రమంగా ఉండి, అభివృద్ధి పథంలో నడిచే జడ్పీలకు ఏటా రూ. 10 కోట్ల గ్రాంటును కూడా ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మొత్తానికి కేసీఆర్ గ్రామస్థాయిలో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా తగు చర్యలు తీసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తంఅవుతున్నాయి. ఆయన చర్యలు సత్ఫలితాలు ఇస్తే రాబోయే కాలంలో తెలంగాణలో కొత్త మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఉండాలని అధికారులను అదేశించారు. అంతే కాదు… మంత్రులు ఎవరైనా అవినీతికి పాల్సడ్డారని తేలితే వారి మంత్రి పదవులను తీసేస్తానని కూడా హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాలలో ఎన్నాళ్ల నుంచో పేరుకుపోయిన అవినీతిని సమూలంగా మార్చడం కష్టమే కాని… కొంత వరకూ మార్పు తీసుకురావచ్చునని ఇరు రాష్ట్రాల్లోని సీనియర్ అధికారులు అంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *