ఎవెంజర్స్ ఎండ్ గేమ్ రివ్యూ

ఎవెంజర్స్ ఎండ్ గేమ్ రివ్యూ

భాషాభేదాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్ని అవెంజర్స్‌ సిరీస్‌ చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా రూపొందిన చిత్రమే అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌. ప్రపంచసినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లను సాధించిన అవెంజర్స్‌ ఇన్ఫినిటీవార్‌కు కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ హాలీవుడ్‌ సినిమా కోసం తెలుగు స్ట్రెయిట్‌ చిత్రాల విడుదలను వాయిదా వేసుకొనే పరిస్థితి నెలకొందనే ఈ సూపర్‌హీరో సినిమాకున్న క్రేజ్‌ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ సూపర్‌ హీరోస్‌ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకుమరింత చేరువ చేయడం కోసం ఏ.ఆర్‌.రెహమాన్‌ ప్రత్యేకంగా పాటను సమకూర్చడం, థానోస్‌ పాత్రకు రానా గళాన్ని అందించడంలో ఈసినిమా పట్ల అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ అవెంజర్స్‌ అభిమానుల్ని ఎలా అలరించారో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

అనంత మణుల్ని(ఇన్ఫినిటీ స్టోన్స్‌) చేజక్కించుకున్న థానోస్‌ వాటి శక్తితో సగం విశ్వాన్ని నాశనం చేస్తాడు. థానోస్‌ దాడిలో భూమిపై నివసించే కోట్లాది మంది ప్రజలతో అవెంజర్స్‌ టీమ్‌ సభ్యుల్లో కొందరు మరణిస్తారు. మరికొందరు తమ కుటుంబాల్ని కోల్పోతారు. ఈ వినాశనం తర్వాత ఒంటరిగా వేరే గ్రహంలో నివసిస్తున్న థానోస్‌ను థోర్‌ హతమార్చుతాడు. థానోస్‌ బారి నుంచి ప్రజల్ని రక్షించలేకపోయామనే నిరాశలో మునిగిపోతారు అవెంజర్స్‌ బృందం. క్వాంటమ్‌ రీలెమ్‌ అనే సాంకేతికత ద్వారా టైమ్‌ మిషన్‌ సహాయంలో కాలగమనంలో వెనక్కివెళ్లి ఆరు అనంత మణుల్ని తిరిగి సంపాదిస్తే నాశనం అయిన విశ్వాన్ని తిరిగి పునసృష్టించవచ్చనే నిజం యాంట్‌మెన్‌ ద్వారా తెలుస్తుంది. ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నప్పటికీ ధైర్యంగా అవెంజర్స్‌ టీమ్‌ ఈ ప్రయోగానికి సిద్ధపడతారు. మూడు బృందాలుగా విడిపోయి అనంత మణుల్ని సంపాదించే ప్రయత్నాలు చేస్తారు.

కాల ప్రయాణంలో నాశనమైన విశ్వాన్ని పునసృష్టించేందుకు అవెంజర్స్‌ టీమ్‌ చేస్తున్న ప్రయత్నం గురించి థానోస్‌కు తెలుస్తుంది. అదే టైమ్‌మిషన్‌ సహయంలో ప్రస్తుత కాలానికి వచ్చిన థానోస్‌ అనంత మణుల్ని తిరిగి చేజిక్కించుకొని భూగ్రహాన్ని పూర్తిగా నాశనం చేయాలని అనుకుంటాడు. అతడి ప్రయత్నాన్ని అవెంజర్స్‌ టీమ్‌ ఎలా తిప్పికొట్టారు. థానోస్‌ చేతిలో ఒటమికి ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ ప్రమాదంలో అవెంజర్స్‌ టీమ్‌కు ఎలాంటి విపత్తులు ఎదురయ్యాయి అన్నది ఈ చిత్ర ఇతివృత్తం. అబ్బుర పరిచే గ్రాఫిక్స్‌ హంగులు, రొమాంచితమైన యాక్షన్‌ సన్నివేశాలతో పాటు వినోదం, భావోద్వేగాల మేళవింపుతో దర్శకద్వయం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైమ్‌మిషన్‌ సహాయంతో కాలగమనంలో అవెంజర్స్‌ బృందం వెనక్కి వెళ్లే సన్నివేశాలు ఉత్కంఠను పంచుతాయి. థోర్‌ పాత్ర ద్వారా తల్లి కొడుకుల అనుబంధం, భార్యాపిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడపాలనే వ్యక్తిగా ఐరెన్‌మెన్‌..ఇలా ఒక్కో పాత్రకు ఒక్కో ఎమోషన్‌ను ఆపాదించి కథనాన్ని నడిపించిన విధానం బాగుంది. గ్రాఫిక్స్‌తో ముడిపడిన ఈసినిమా అయినప్పటికీ మానవీయ విలువలకు పెద్దపీట వేస్తూ సినిమాను రూపొందించారు. సీరియస్‌గా సాగే ఈ కథలో థోర్‌, యాంట్‌మెన్‌ పాత్రలు ద్వారా చక్కటి హాస్యాన్ని రాబట్టుకున్నారు దర్శకులు.

పతాక ఘట్టాలు వచ్చే భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సూపర్‌హీరోస్‌ అందరూ కలిసి బలవంతుడైన థానోస్‌ను ఎదిరించే యుద్ధ సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తాయి. మార్వెల్‌ సంస్థ ఇదివరకు రూపొందించిన సూపర్‌హీరోస్‌ సినిమాల మాదిరిగానే ఈ చిత్రాన్ని భారీ గ్రాఫిక్స్‌ హంగులతో అద్భుతంగా తెరకెక్కించారు. క్లెమాక్స్‌లో వచ్చే గ్రాఫిక్స్‌ అలరిస్తాయి. ఐరెన్‌మెన్‌, బ్లాక్‌విడో పాత్రల్ని విషాదంతంగా ముగించారు. అవెంజర్స్‌ బృందంలో ధైర్యాన్ని నింపుతూ వారిని ముందుకు నడిపించే హీరోగా కెప్టెన్‌ అమెరికా పాత్ర పవర్‌ఫుల్‌గా సాగుతుంది. ఐరెన్‌మెన్‌, యాంట్‌మెన్‌, కెప్టెన్‌ అమెరికా, డాక్టర్‌ స్ట్రేంజ్‌, స్పైడర్‌మెన్‌, హల్క్‌తో పాటు అన్ని సూపర్‌ హీరోస్‌ పాత్రలు ఈ సినిమాలో కనిపించి మరోసారి ప్రేక్షకుల్ని కనువిందుచేస్తాయి.

సినిమా నిడివి మూడు గంటలైనా పెద్ద సినిమా అనే అనుభూతిని ప్రేక్షకుడిలో కలగనీయకుండా చేయడంలో దర్శకద్వయం పూర్తిగా విజయవంతమయ్యారు. సూపర్‌ హీరోస్‌ పట్ల అభిమానాన్ని మరింత పెంచే సినిమా ఇదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *