కుమారస్వామి సర్కారు కూలిపోతుందా!?

కుమారస్వామి సర్కారు కూలిపోతుందా!?

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అందరిలో ఆసక్తిని పెంచింది. ఎగ్జిట్ పోల్స్‌ను నిజం చేస్తూ బీజేపీ వార్ వన్ సైడ్ రేంజ్‌లో కొనసాగుతున్న ఈ సమయంలో కర్ణాటక సీఎం కుమారస్వామి మైసూర్ చాముండేశ్వరి ఆలయంలో ఈ రోజు ఉదయం పూజలు చేశారు. అయితే, ఆయన పూజలకు ఆశీర్వాదం దక్కలేదు. ఫలితాల్లో జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి ఘోరంగా ఓటమి ఎదురైంది. మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో జేడీఎస్ కేవలం ఒకే ఒక్క స్థానానికే పరిమితం కావడంతో, దాని మిత్ర పక్షం కాంగ్రెస్ 3 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో నిలిచింది. ప్రతిపక్ష బీజేపీ 23 స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతుండగా, ఆ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన మాజీ మంత్రి అంబరీష్ సతీమణి సుమలత మాండ్యాలో విజయం దిశగా వెళ్తున్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకే సుమలత మద్దతు ఉంటుందని ఆమె మద్దతుదారులు స్పష్టం చేశారు. దీంతో ఆమె బీజేపీవైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు కుమారస్వామి సర్కారు భవిష్యత్తుని నిర్ణయించేవి అవడం విశేషం. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ రాష్ట్ర మాజీ సీఎం యడ్యూరప్ప ఇదివరకే చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రానికి కుమారస్వామి సర్కారు కూలిపోతుందంటూ కేంద్ర మంత్రి సదానందగౌడ తెలిపారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాహాటంగానే సిద్ధరామయ్య తీరుపై తమ అంసతృప్తిని వెళ్లగక్కడం జరిగింది. పలువురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారన్న కథనాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కుమారస్వామి సర్కారు పాలిట ఆశనిపాతంలా మారింది. ఇక ఏ క్షణంలోనైనా జేడీఎస్-కాంగ్రెస్ కూటమి సర్కారు కూలిపోవచ్చననే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *