ముంబైలో హైడ్రామా..హోట‌ల్ వ‌ద్ద 144 సెక్ష‌న్‌

ముంబైలో హైడ్రామా..హోట‌ల్ వ‌ద్ద 144 సెక్ష‌న్‌

కర్ణాటక రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. స్పీకర్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించకుండా పక్షపాత దోరణితో వ్యవహరిస్తున్నారని యడ్యురప్ప ధర్నాకు దిగారు. తమ రాజీనామాలు ఆమోదించేలా చూడాలని అసమ్మతి ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతను శివకుమార్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కర్నాటక రాజకీయం వేడెక్కుతోంది.

కర్నాటకలో రాజకీయ చదరంగం వాడివేడిగా సాగుతోంది. రోజుకో కొత్త మలుపుతో అన్ని రాజకీయ పక్షాలకు కంటి మీద కునుకు లేకుండా అవుతోంది. వ్యూహ,ప్రతి వ్యూహాలతో నేతలు వారి ఆలోచనలకు పదునుపెడుతున్నారు. బీజేపీ ప్రస్తుత పరిణామాలకు తగ్గటు పావులు కదుపుతోంది. కర్నాటక రాజధాని బెంగళూరులో మాజీ సీఎం యడ్యూరప్ప పార్ట నేతలతో కలిసి ధర్నాకు దిగారు. స్పీకర్ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరింస్తున్నారని మండిపడ్డారని అన్నారు. ఆయన అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేల రాజీనామాలను వెంటనే ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. లేని యడల ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

మరోవైపు కర్నాటకీయాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కూడా ప్రకంపనలు పుట్టాయి. రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు వచ్చిన కాంగ్రెస్‌ నేత శివకుమార్‌ను హోటల్‌ ముందు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఎమ్మెల్యేలను కలవకుండా తాను హోటల్‌ నుంచి వెళ్లేది లేదని ఆయన తెగేసి చెప్పారు. దీంతో ముంబాయి పోలీసులు హోటల్‌ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు.

మరోవైపు అసమ్మతి ఎమ్మెల్యేలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా శివ కుమార్‌ను కలిసేది లేదని స్పష్టం చేశారు. అయితే అంతటితో ఆగకుండా తమ రాజీనామాలను స్పీకర్‌ ఎటూ తేల్చకపోవడంతో రెబల్ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. తమ రాజీనామాలను ఆమోదించకుండా స్పీకర్‌ రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ అసంతృప్త ఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసుని ఈరోజు సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.అయితే ఈ రోజు విచారణలో కోర్టు ఏం చెబుతుందో చూడాలి. ఏదిఏమైనా.. రాజకీయంగా జరుగుతున్న రసవత్తర క్రీడలతో కర్నాటక యావత్ దేశాన్ని తనవైపు చూసేలా చేస్తుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *