ఉప ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విజయం

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విజయం

కర్నాటక ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ టపాకాయలు పేలాయి. బీజేపీ టపాసులు తుస్‌మన్నాయి. మూడు లోక్‌సభ, 2 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీపై ఉన్న వ్యతిరేకత కోట్టొచ్చినట్లుగా కనిపించింది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికే కన్నడీలు జై కొట్టారు. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన బీజేపీకి అక్కడ ప్రతికూన పవనాలే వీచాయి. బీజేపీ వ్యూహాలకు అక్కడి ప్రజలు చెక్‌ పెట్టారు.

భాజపా ఘోర పరాభవం

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ భారతీయ జనతాపార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక ఉప ఎన్నికల్లో భాజపా ఘోర పరాభవం చవిచూసింది. కేవలం ఒకే ఒక్క స్థానంలో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. మిగతా నాలుగు చోట్ల అధికార కాంగ్రెస్‌-జేడీయూ కూటమి జయకేతనం ఎగురవేసింది. బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్‌ ఎంపీలు రాజీనామా చేయడం, రామనగర శాసనసభ స్థానాన్ని సీఎం కుమారస్వామి వదులుకోవడం, జమఖండీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మృతిచెందడటంతో ఈ స్థానాల్లో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.

కుమారస్వామి సతీమణి  జయభేరీ

Anitha Kumaraswamy

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కుమారస్వామి రామనగర, చెన్నపట్న స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఫలితాల అనంతరం రామనగర స్థానానికి కుమారస్వామి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌ తరఫున బరిలోకి దిగిన సీఎం కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి జయభేరీ మోగించారు. సమీప బీజేపీ అభ్యర్థిపై దాదాపు లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు.

బళ్లారి లోను…

ఈ ఎన్నికల్లో భాజపా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలోనూ ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. నేడు వెలువడిన ఫలితాల్లో బళ్లారిలో బీజేపీ అభ్యర్థి శాంతపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఉగ్రప్ప భారీ మెజార్టీతో గెలుపొందారు. బళ్లారిలో 2004 నుంచి బీజేపీనే గెలుస్తూ వస్తోంది. అంతేగాక గాలి జనార్దన్‌ రెడ్డి సోదరులకు మంచి పట్టున్న నియోజకవర్గం. గత 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ నేత శ్రీరాములు బళ్లారిలో విజయం సాధించారు. అయితే ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన శ్రీరాములు తన లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ కూడా ఎన్నిక అనివార్యమైంది.

2లక్షల ఓట్ల మెజార్టీతో

ఉపఎన్నికల్లో బీజేపీ తరపున పోటీలో ఉన్న శ్రీరాములు సోదరి శాంతకి ఓటమి పాలైంది. శాంతకు పోటిగా కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి బలమైన అభ్యర్థిని పోటీలో నిలబెట్టింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడైన ఉగ్రప్పను కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దించింది. ఉగ్రప్పకు జేడీఎస్‌ పార్టీ మద్దతివ్వడంతో తొలి రౌండ్‌ నుంచే ఆధిక్యం ప్రదర్శించిన ఉగ్రప్ప దాదాపు 2లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

కలబుర్గీలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచి టపాసులు కాల్చారు. ఈ ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు లాంటివన్నారు. కమల దళానికి మిగతా రాష్ట్రాల్లో కూడా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *