మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ vs చౌహాన్

మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ vs చౌహాన్

సమరం సమ ఉజ్జీల మధ్య సాగితే ఆ మజాయే వేరు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య హోరాహోరీ పోరు నెలకొంటే ఆ కిక్కే వేరు. మూడు పర్యాయాలు మరొకరికి అవకాశం లేకుండా పోయిన చోట…అనూహ్యంగా రాష్ట్రం హస్తగతమైంది. ఈలోగా పార్లమెంట్ ఎన్నికలు కూడా రావడంతో, ఇరు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్‌ ఉంటే, లోక్‌సభ సమరంలో ఆ లెక్కలేవీ పనిచేయవంటోంది బీజేపీ.

మధ్యప్రదేశ్‌లో సీఎం వర్సెస్ మాజీ సీఎంల మధ్య ఎన్నికల యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఓ వైపు…మూడుసార్లు హ్యాట్రిక్ సీఎంగా పనిచేసి ఇటీవల ఎన్నికల్లో తృటిలో పవర్‌ను కోల్పోయిన శివరాజ్ సింగ్ చౌహాన్ మరోవైపు. ఈ ఇద్దరు దిగ్గజాలు పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో పట్టుకోల్పోయిన చౌహాన్ లోక్ సభ ఎన్నికల ద్వారా పుంజుకునేందుకు పావులు కదుపుతుండగా…ఎంపీ ఎన్నికల్లోనూ మెజార్టీ సాధించి, రాష్ట్రంలో మరింత బలపడాలని కమల్ నాథ్ ఉవ్విళ్లూరుతున్నారు. బీజేపీ నుండి లోక్‌సభ ఎన్నికల్ని శివరాజ్ సింహ్ చౌహాన్ ముందుండి నడిపిస్తుండగా…సుందర్‌లాల్‌ పాత్వా, ఉమాభారతి పార్టీకి అండదండగా నిలుస్తున్నారు. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ రాజకీయ వ్యూహాలే పార్టీని ముందుండి నడిపించనున్నాయి. దిగ్విజయ్‌ సింగ్‌, యువనేత జ్యోతిరాదిత్య సింధియా లాంటి బలమైన నేతలు కాంగ్రెస్‌కు ఉండనే ఉన్నారు.

సంక్షేమ పథకాల సారథిగా జనంలో కరిష్మా ఉన్న నాయకుడు చౌహాన్‌. గత లోక్‌సభ ఎన్నికల్లో చౌహాన్‌కున్న ఇమేజ్‌కి తోడు మోదీ హవా కలసి రావడంతో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. 29 స్థానాలకు 27 చోట్ల జయకేతనం ఎగురవేసింది. కానీ రైతు సమస్యలు, నిరుద్యోగం వంటి కారణాలతో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. అయితే ప్రత్యర్థి కంటే ఓట్లు ఎక్కువగా సాధించడం విశేషం. బీజేపీకి 41 శాతం ఓట్లు వస్తే, కాంగ్రెస్‌కు 40.9 శాతం ఓట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలుండగా, కాంగ్రెస్ 114 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, మెజార్టీకి 2 సీట్ల దూరంలో నిలిచిపోగా.. బీఎస్పీ మద్దతుతో అధికారాన్ని దక్కించుకుంది. కమల్‌నాథ్‌ సీఎం పీఠం అధిష్టించిన దగ్గరి నుంచి లోక్‌సభ ఎన్నికలపైనే దృష్టి పెట్టి.. దానికి అనుగుణంగా వ్యూహాలు పన్నుతూ పాలనను పరుగులెత్తిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా…. కమల్‌నాథ్‌ పాలనలో లోటుపాట్లను ఎత్తిచూపుతూ సమరశంఖం పూరిస్తోంది. కేంద్రంలో మోదీకున్న ఇమేజ్‌ లోక్‌సభ ఎన్నికల్లో కలిసి వస్తుందని కమలదళం భావిస్తోంది.

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు పాటు పనిచేసిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, రాష్ట్రంలో పార్టీని మించి ఎదిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి మోదీని పెద్దగా రానివ్వలేదు కూడా. తన సంక్షేమ కార్యక్రమాలనే నమ్ముకొని ఎన్నికల బరిలో దిగారు. ఓటమి పాలయ్యాక తనదే నైతిక బాధ్యతని ప్రకటించారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్ని కూడా తన భుజస్కంధాలపైనే వేసుకున్నారు. ప్రజల్లో చౌహాన్‌కు ఉన్న ఇమేజ్‌ ను దెబ్బకొట్టేందుకు, కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. చౌహాన్‌ రాష్ట్ర ఖజానాను గుల్ల చేశారని, ఆయన ఓటమి పాలయ్యాక చౌహాన్‌ను బీజేపీ దూరం పెట్టిందని విమర్శలు గుప్పిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకే, చౌహాన్‌ను ప్రతిపక్ష నేత నియమించలేదని కమలనాథులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్‌లో గెలుపు కాంగ్రెస్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచినా, పార్టీలో అంతర్గతంగా ఓట్లు తక్కువ నమోదవడంపై చర్చ జరుగుతోంది. దీనిని అధిగమించే వ్యూహాలకు కమల్‌నాథ్‌ పదును పెడుతున్నారు. 45 శాతంపైగా ఉన్న ఓబీసీ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఓబీసీ రిజర్వేషన్లను 14 నుంచి 27 శాతానికి పెంచుతూ నిర్ణయించింది. అయితే ఎన్నికల ముందు ఇది సరి కాదంటూ హైకోర్టు అక్షింతలు వేసి, పెంపు నిర్ణయంపై స్టే విధించింది. జనాభాలో 21.1 శాతానికి పైగా ఉన్న ఆదివాసీల ఓట్లను ఆకర్షించడానికి, అటవీ హక్కుల చట్టం కింద భూ యాజమాన్య హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక, ఇదిలా ఉంటే బీజేపీ ఈసారి అభ్యర్థుల ఎంపికలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఏడుగురు సిట్టింగ్‌ ఎంపీలను మార్చేసింది.

మధ్యప్రదేశ్‌ రాష్ట్ర జనాభాలో 90 శాతానికి పైగా హిందువులే ఉండడంతో, హిందూత్వ కార్డు ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో హిందూత్వ గాలులు బలంగా వీస్తున్నాయి. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సీఎంగా ఉన్న కాలంలో హిందూ మితవాదిగానే ఉన్నా హిందూత్వ వాదానికి బలం చేకూర్చేలా వ్యవహరించారు. కమల్‌నాథ్‌ తన వంద రోజుల పాలనలో హిందూత్వ బ్రాండ్‌ని ప్రచారం చేయడానికి ప్రాధాన్యతనిచ్చారు. వచ్చే నాలుగు నెలల్లో వేలాది గోశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదంతా చూస్తున్న రాజకీయ పరిశీలకులు కమల్‌నాథ్‌ బీజేపీకి బీ–టీమ్‌ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. సరైన ఉద్యోగావకాశాలు లేక యువత నిరాశలో కూరుకొని ఉండడం బీజేపీకే నష్టం కలిగిస్తుందన్న అంచనాలైతే ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ ఇంకా పూర్తిగా జరగకపోవడం కమల్‌నాథ్‌ సర్కార్‌ని ఆత్మరక్షణలో పడేసింది. మరోవైపు వైద్య సౌకర్యాలు, విద్యుత్, శాంతి భద్రతలు, మౌలిక సదుపాయాల కల్పన కూడా ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *