కమల వికాసం కష్టమేనా...!

కమల వికాసం కష్టమేనా...!

నరేంద్ర మోడీ …2014లో బీజేపీకి అప్రతిహత విజయాన్ని సాధించి పెట్టిన నేత.అప్పటికీ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను నాలుగు పదుల సీట్లకే పరిమితం చేసిన నాయకుడు.ఈ ఐదేళ్లూ దేశాన్ని తిరుగు లేకుండా ఏలిన, ఏలుతున్నప్రధాని.కానీ,2019 ఎన్నికలు మాత్రం ఆయనకు విషమ పరీక్షనే తెచ్చి పెట్టాయి.దేశంలో ఇప్పటికే రెండు దశల ఎన్నికలు జరిగాయి.186 స్థానాలకు పోలింగ్ జరిగింది.ఇందులో బీజేపీకి 20 స్థానాలు అయినా వస్తాయా అంటే..అనుమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.అందుకే ఉత్తరాదిలో జరుగనున్న ఎన్నికల ప్రచారంలో మోడీ‌,షా ద్వయం సర్వశక్తులూ ఒడ్డుతోంది.మరీ ఇంతగా ఎందుకు కష్టపడాల్సి వస్తోందా అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అవన్నీ తిప్పికొట్టాయి…
పెద్దనోట్ల రద్దు నిర్ణయం దేశంలో పెద్ద దుమారమే రేపింది.బీజేపీకి సన్నిహితంగా ఉండే వాణిజ్య వర్గాలకు ఇది అశనిపాతంగా తాకింది.మధ్య,చిన్న తరహా వ్యాపారులకు జీఎస్టీ చుక్కలు చూపించింది.వారంతా ఈసారి నరేంద్రమోడీకి గుణపాఠం నేర్పాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.ఈ విషయాన్ని పసిగట్టిన మోడీ ఎక్కువగా యువతను తన లక్ష్యంగా చేసుకుంటున్నారు.అందులోనూ కొత్తగా ఓటు హక్కు పొందిన నవ యువత మీద గురి పెట్టారని చెబుతున్నారు.బాలాకోట్ లాంటి సంఘటనలను ప్రస్తావిస్తూ వారిలో దేశభక్తిని రంగరించేందుకు యత్నిస్తున్నారు.

సరిహద్దే ప్రచారాస్త్రం

సరిహద్దు ఉద్రిక్తతలనే తన ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు.ఇది బీజేపీకి ఏ మేరకు లాభం చేకూరుస్తుందో తెలియదు కానీ,ఇలాంటి వాటితో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఈ విషయాన్ని మాత్రం మోడీ,షా ద్వయం అంతగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు.మూడో దశ పోలింగ్ పూర్తయ్యాక ప్రచార సరళి ఏ రకంగా మారిపోతుందో చూడాలని ఒక సీనియర్ జర్నలిస్టు ఒకరు వ్యాఖ్యానించారు.ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం మోడీకి రాజకీయ సెగ బాగానే తగులుతోంది.అందుకే దేశంలో ఉన్న చిన్నా,చితక పార్టీలనూ దువ్వుతున్నారని చెబుతున్నారు.సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచి అధికారంలోకి రావడానికి కొన్ని సీట్లు తక్కువ పడితే చిన్న పార్టీలు ఉపయోగపడతాయనే ఆశ ఒకవైపు ఉన్నా…బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫెడరల్ ఫ్రంట్ కొంప ముంచుతుందా అనే భయం కమలనాథులిద్దరినీ వేధిస్తోందని అంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *