పార్టీ పెట్టే యోచనలో కాకా సన్స్‌

పార్టీ పెట్టే యోచనలో కాకా సన్స్‌

ఒకప్పుడు వారికి అవకాశాలు వెతుక్కుంటే వచ్చేవి…?కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. రాజ‌కీయాల్లో కాలం క‌లిసిరాక అవ‌కాశాల కోసం ఎదురుచూడాల్సిన ప‌రిస్థితులు ఏర్పడ్డాయి. తొలిసారి ఆ కుటుంబం ఎన్నికలకు దూరమైంది. ఆ ఇద్దరు సోదరులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు…? తదుపరి కార్యాచరణ ఏంటి..?

పెద్దప‌ల్లి పార్లమెంట్ ప‌రిధిలో ద‌శాబ్దాల పాటు రాజ‌కీయాల‌ను కంటిచూపుతో శాసించిన కాక వెంక‌ట‌స్వామి కుటుంబం మొద‌టిసారిగా ప్రత్యక్ష ఎన్నిక‌ల‌కు దూర‌మైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నిక‌లు ఏవైనా, కాక ఫ్యామిలి నుంచి ఎవ‌రో ఒక‌రు పోటీలో ఉండేవారు. గెలుపోట‌ముల సంగతి ఎలా ఉన్నా ఎన్నిక‌ల్లో పోటీచేయ‌డం వారికి అంత క‌ష్టమేమి కాదు. అలాంటిది మొద‌టిసారి కాక కుటుంబం ఎన్నిక‌ల బ‌రిలో లేకుండా పోయింది. ప‌ది సంవ‌త్సరాల కింద‌టి వ‌ర‌కు ఉమ్మడి క‌రీంన‌గ‌ర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కాక వెంక‌ట‌స్వామి రాజ‌కీయాల్లో త‌న‌దైన చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత ఆయన వారసులు వివేక్‌, వినోద్‌లు యాక్టివ్‌ పాలిటిక్స్‌లో కొనసాగుతుతూ వస్తున్నారు. 2018 ఎన్నికల్లో వినోద్ టీఆర్ఎస్‌ నుంచి టికెట్ రాకపోవడంతో, బీఎస్పీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అక్కడే అసలు కథ మొదలైంది. స్థానిక ఎమ్మెల్యేలు, నేతల వ్యతిరేకత మూటగట్టుకున్న వివేక్‌ చివరకు 2019 ఎన్నికల బరిలో లేకుండా పోయారు.

కాక బ‌తికున్నంత కాలం వివేక్, వినోద్ ల‌కు రాజ‌కీయంగా ప్రాధాన్యం ఉండేది. కానీ కాక మ‌ర‌ణం త‌ర్వాత సోదరులిద్దరూ ప్రత్యక్ష రాజ‌కీయాల్లో అంత‌గా రాణించ‌లేక‌పోయారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి, మ‌ళ్లీ ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. వారు అనుకున్నదానికి భిన్నంగా 2014 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ విజ‌యం సాధించ‌డంతో, కొద్ది కాలానికే మ‌ళ్లీ టీఆర్ఎస్ పార్టీలోకి మారారు. సీన్ కట్ చేస్తే, పెద్దప‌ల్లి ఎంపీ సీటుపై ఆశ‌లు పెట్టుకున్న వివేక్, సొంత త‌ప్పిదాల కార‌ణంగా టికెట్ కోల్పోయి అవ‌మానం భారంతో పార్టీ, పదవులకు రాజీనామా చేశారు. ప్రస్తుతం ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉన్న వివేక్‌… కాక కాంగ్రెస్ పేరుతో సొంతంగా పార్టీ పెడతారన్న ఊహగానాలు వినిపిస్తున్నాయి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో కాక తనయులు అంత సాహసం చేయరన్న టాక్ బలంగా వినిపిస్తోంది.

దళిత సామాజిక‌వ‌ర్గంలో రాష్ట్రంలోనే అత్యంత ధ‌న‌వంతుల్లో ఒక‌రిగా ఉన్న వివేక్, సొంతంగా పార్టీ పెట్టే విషయమై రాజ‌కీయాల్లోని కొంత‌మంది ప్రముఖుల‌తో స‌మాలోచ‌న‌లు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. అయితే తెలంగాణ‌లో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రాజ‌కీయ పార్టీ స్థాపించ‌డం, దాన్ని ఎన్నిక‌ల వ‌రకు అలాగే ప్రజ‌ల్లో బ‌లంగా ఉంచ‌డం కత్తిమీద సాము లాంటిది. రాజకీయ పార్టీ పెడితే… వ్యక్తిగతంగానూ, ఆర్థికంగానూ దెబ్బతినే అవకాశముండడంతో వివేక్ సందిగ్ధంలో పడ్డారట. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ప‌నిచేసిన కాక వెంక‌ట‌స్వామి పేరుపై కాక‌ కాంగ్రెస్ పార్టీ స్థాపిస్తే… సంకీర్ణ ప్రభుత్వాల శ‌కంలో కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉంటుందని వివేక్ సన్నిహితులు సూచిస్తున్నారట. కాక అభిమానులు సైతం పార్టీ పెట్టాలంటూ వివేక్ పై ఒత్తిడి తీసుక‌వ‌స్తున్నారట. ఐతే, ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బ‌ట్టి వేచి చూడాలని వారు భావిస్తున్నారని తెలుస్తోంది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *