కడియం నారాజ్‌..ఎర్రబెల్లి హుషార్ !!

కడియం నారాజ్‌..ఎర్రబెల్లి హుషార్ !!

ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంకు చెందిన కడియం శ్రీహరి విద్యావేత్త… సాధారణ లెక్చరర్ అయిన ఆయన ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయ అరంగేట్రం చేశారు. ఎన్టీఆర్ కేబినెట్ లో కీలక మంత్రి పదవులు చేపట్టారు. నాటి రాజకీయ అనిశ్చితిలో చంద్రబాబు నాయుడుతో కలిసి రెండు దశాబ్దాల పాటు కీలక మంత్రి పదవులు చేపట్టి, జిల్లా అభివృద్ధికి పునాది వేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో….టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. సీనియర్ పొలిటీషియన్ అయిన కడియం శ్రీహరి పార్టీలో చేరగానే, అధినేత ఆయనకు పెద్ద పీట వేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. గత ఐదేళ్లలో జిల్లాలో అంతా తానై చక్రం తిప్పారు కడియం. కానీ, ప్రస్తుతం ఏ హోదా లేక కడియం ఆవేదన చెందుతున్నారట.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నుంచి పోటీ చేయాలని కడియం భావించారు. కానీ, అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకే అవకాశం వచ్చింది. రాజయ్య గెలుపు బాధ్యతను కేసీఆర్ శ్రీహరికి అప్పగించడం…భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగిపోయాయి. రెండోసారి కేసీఆర్ అధికారంలోకి రాగానే కేంద్ర రాజకీయలపై దృష్టి సారించాలని భావించారు. కేసిఆర్ తోపాటు కడియం శ్రీహరిని ఢిల్లీకి తీసుకెళతారని, అందుకే మంత్రి పదవి ఇవ్వలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, ఆతర్వాత వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో కూడా కడియంకు సీటు దక్కలేదు. తెలంగాణలో కారు వేగం తగ్గడం, కేంద్రంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి రావడంతో….సెంట్రల్‌లో చక్రం తిప్పాలనుకున్న గులాబీ నేతల ఆశలు అడియాశలయ్యాయి.

ఉమ్మడి జిల్లా లో సీనియర్ మంత్రిగా ఓ వెలుగు వెలిగిన కడియం శ్రీహరి, ప్రస్తుతం కేబినెట్‌లో బెర్త్ దొరక్కపోవడంతో పరేషాన్ అవుతున్నారట. ఇదే జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు తొలి విడతలో మంత్రి పదవి దక్కింది. దీంతో, జిల్లా రాజకీయల్లో ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధుల గెలుపు కోసం కృషి చేశారు. జిల్లాలో ఎర్రబెల్లి హవా నడుస్తుండడంతో, కడియం శ్రీహరి అనుచరులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట.

మలివిడత కేబినెట్‌లోనైనా కడియం శ్రీహరికి చోటు దక్కుతుందో లేదో చూడాలి మరి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *